డిజిటల్ లెర్నింగ్ తో గణిత బోధన మరింత ప్రతిభావంతం
జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో చేపట్టిన డిజిటల్ లెర్నింగ్ విదానంతో గణిత బోధన మరింత ప్రతిభావంతంగా జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్(Additional Collector Yuvraj Marmat) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గణిత ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న "ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్" శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో గణితం పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి తార్కిక ఆలోచన సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఆధునిక సాంకేతికతను గణిత బోధనలో విస్తృతంగా వినియోగించాలని తెలిపారు. సాంప్రదాయ బోధన విధానాలతో పాటు ఆధునిక సాంకేతిక వనరులను సమర్ధవంతంగా వినియోగించడం ద్వారా విద్యార్థులకు క్లిష్టమైన గణిత భావనలను సులభంగా, ఆసక్తికరంగా, దృశ్య రూపంలో అర్థమయ్యేలా బోధించవచ్చని తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపాధ్యాయుడి బోధన సామర్థ్యాన్ని మరింత పెంచే శక్తివంతమైన సాధనంగా చూడాలని తెలిపారు.
శిక్షణలో ఉపాధ్యాయులు పొందిన జ్ఞానం, నైపుణ్యాలను తరగతి గదులలో ఆచరణలోకి తీసుకువచ్చి ప్రతి విద్యార్థికి నాణ్యమైన గణిత అభ్యాసనాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థుల అభ్యాసనా స్థాయికి అనుగుణంగా డిజిటల్ వనరులను వినియోగిస్తూ లెర్నింగ్ బై డూయింగ్, యాక్టివిటీ బెస్ట్ లర్నింగ్ విధానాలను ప్రోత్సహించాలని, విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్ధ్యాల సాధన గణిత అభ్యాసన ఫలితాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ నాణ్యత సమన్వయకర్త ఉప్పులేటి శ్రీనివాస్, కేంద్ర నిర్వాహకులు మహేశ్వర్, రిసోర్స్ పర్సన్లు, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.