పెద్ద అంబర్‌పేట్‌లో ‘డబుల్’ రిజిస్ట్రేషన్ల దందా?
- కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేశారన్న ఆరోపణలు
- గతంలో పార్క్ స్థలాలకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విమర్శలు
- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 2: పెద్ద అంబర్పేట్(Pedda Amberpet) పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ల(Land registrations) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒకే ఆస్తికి సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ, తిరిగి అదే ఆస్తిపై ఇతర వ్యక్తుల రిజిస్ట్రేషన్లు లావాదేవీలు జరిగా యి. దీంతో భూములు కొనుగోలు చేసిన వారు తమ ఆస్తుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కు స్థలాలను సైతం రిజిస్ట్రేషన్లు జరిగాయి.
కోర్టు ఆదేశాలు ఉన్నా రిజిస్ట్రేషన్లా?
వివాదాస్పద భూములకు సంబంధించి న్యాయస్థానాల్లో(courts of law) కేసులు కొనసాగుతున్న సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత ఆస్తిపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత రికార్డులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఉత్తర్వుల అమలుపై స్పష్టత లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే, అందుకు బాధ్యులెవరు అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, కోర్టు ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
పార్క్ స్థలాల రిజిస్ట్రేషన్లపైనా ఆరోపణలు
ఇదే ప్రాంతంలో గతంలో పార్క్‌ల కోసం కేటాయించిన స్థలాలకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు వినిపించడంతో పార్క్ స్థలాలపై కబ్జాపై విజయక్రాంతి దిన పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పార్క్స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సబ్ రిజిస్టార్ రద్దు చేయడం జరిగింది.
కొనుగోలుదారుల్లో ఆందోళన
డబుల్ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు నిజమైతే, భూమిని కొనుగోలు చేసిన సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే స్థలానికి బహుళ పత్రాలు సృష్టిస్తే భవిష్యత్‌లో యాజమాన్య హక్కులపై వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఉంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయంపై పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్టార్‌ను వివరణ కోసం ఫోన్ సంప్రదించి అందుబాటులోకి రాలేదు.