ఈ ట్రాన్స్ఫార్మర్ దండగేనా?
- జర సూడు.. సామీ...
- నిర్లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది
- జగదేవపూర్‌లో నాలుగేళ్లుగా వృథాగా ట్రాన్స్ఫార్మర్
- గజ్వేల్ డివిజన్లో ఇంకా ఎన్నో...
గజ్వేల్/ జగదేవపూర్, అక్టోబర్ 1: మండల కేంద్రమైన జగదేవపూర్(Jagadevpur)లో నాలుగేళ్లుగా ఓ ట్రాన్స్ఫార్మర్ వృధాగా పడి ఉంది. కోట్లాది రూపాయల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై తక్కువ వ్యయంతో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ట్రాన్స్ఫార్మర్లు వృధాగా ఉంటున్నాయి.
కొన్నిచోట్ల రైతుల పొలాల్లో బోర్లు ఎండిపోగా, మరి కొన్ని చోట్ల సాగునీటికి ప్రత్యామ్నాయలు ఏర్పడడంతో ట్రాన్స్ఫార్మర్ వినియోగంలో లేకుండా పోయాయి. మరికొన్ని చోట్ల దొంగతనాలకు గురై విద్యుత్ సిబ్బంది అధికారులు పట్టించుకోకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి ఆనుకొని ఓ ట్రాన్స్ఫార్మర్ తో పాటు విద్యుత్ స్తంభాలు తీగలు వృధాగా పడి ఉన్నాయి. ఇప్పటివరకు రైతులు, విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు ఆ వైపు చూడకపోవడం గమనార్హం.
మూడేళ్ల క్రితం ఆయిల్, ఏడాది క్రితం రాగి తీగలు చోరీ
గ్రామానికి చెందిన మేకల కనకయ్య అనే రైతు తనకున్న ఎకరంపావు భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు మరో ఇద్దరు రైతులు కలిసి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ సరఫరా కూడా ప్రారంభం కాకముందే ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ ను దొంగలు ఎత్తుకెళ్లారు.
గత ఏడాది క్రితం అందులోని రాగి తీగలు కూడా చోరీకి గురయ్యాయి. గత పంట కాలం వరకు కాలువ ద్వారా సాగునీరు అందుతూ ఉండడంతో రైతులకు విద్యుత్ అవసరం లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ను పట్టించుకోలేదు. కానీ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తమ పరిధిలో ఈ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న విషయాన్ని మర్చిపోయారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ తో పాటు రాగి తీగ కూడా దొంగతనానికి గురై సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం వారి విధి నిర్వహణ తీరకు అడ్డం పడుతుంది.
విద్యుత్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో లెక్కగట్టి జియో పద్ధతిలో గుర్తిస్తుండగా, ఈ ట్రాన్స్ఫార్మర్ విషయాన్ని అధికారులు మరిచిపోవడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు డివిజన్ వ్యాప్తంగా పలుచోట్ల దర్శనమిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు వృధాగా పడి ఉండడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని ఇకనైనా అధికారులు విద్యుత్ శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు ఇతర పరికరాల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు : శివశంకర్ విద్యుత్ శాఖ ఏఈ జగదేవపూర్
నేను బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్ళు అయింది. ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం వల్ల వారు సమాచారం అందిస్తేనే ట్రాన్స్ఫార్మర్ యొక్క స్థితి గురించి మాకు తెలుస్తుంది. వెంటనే సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం ట్రాన్స్ఫార్మర్ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని చర్యలు తీసుకుంటాం.