15 May, 2026 | 8:56 PM

డివైడర్ పై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు

15-05-2026 08:25 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని డివైడర్ పై అడ్డగోలుగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేస్తున్నారని, ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తీసుకుంటున్నారా అని గ్రామ పంచాయతీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డివైడర్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక ప్రక్కకు వంగిపోయి వాహనదారులకు ఇబ్బందిగా మారాయని, వాహనాలు ప్రయాణించేటప్పుడు ప్రయాణికులపై ఈ ఫ్లెక్సీలు పడి జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత రద్దీగా ఉండే బాలాజీ సెంటర్ లో సత్తుపల్లి పట్టణానికి చెందిన ఒక స్కూల్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.  అది ఇటీవల గాలి వానలకు విరిగిపోయి రహదారిపైకి వంగి ఉన్నది, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా కలిగి వుండాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా డివైడర్ పై ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలకు పంచాయతీ పర్మిషన్ ఇవ్వలేదని, ఎవరైనా అనధికారికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే నోటీసులు జారీ చేసి తొలగిస్తామని తెలిపారు.