స్వదేశీ ఎక్కడ? సత్యం ఏది?

02-10-2026 | 05:10am

సుమారు వెయ్యేళ్ల పరాయి పాలనలో మగ్గిన భరతభూమి అనేక అవమానాలు, అణచివేతలను భరించి.. ఎట్టకేలకు సొంత కాళ్లపై నిలబడింది. అందుకు పునాది వేసిన మహా నాయకుడు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ(Mohandas Karamchand Gandhi). ఆయన చేతిలో ఆయుధం లేదు, సైన్యమూ లేదు. కానీ, ఆయన నమ్మిన మూడు శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. సత్యం, అహింస, స్వదేశీ.. ఇవి గాంధీజీ కేవలం తన ప్రసంగాల్లో చెప్పిన సిద్ధాంతాలు మాత్రమే కాదు.

తన జీవితంలో ఆచరించి చూపిన విలువలు. స్వా తంత్య్రం దేనికోసం? మనల్ని మనం పా లించుకునే స్వపాలన కోసమా? లేక పరా యి పాలనను పారద్రోలేందుకా? అనే విషయంపై కూలంకషమైన చర్చ జరిగిన తర్వాత, స్వాతంత్య్రోద్యమ నిర్మాణంపై గాంధీజీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. దక్షిణాఫ్రికాలో తాను ప్రయోగించిన అ హింస, సత్యాగ్రహం అనే ఆయుధాలనే భారత్‌లోనూ ఉపయోగించాలని సంకల్పించా రు.

విశాలమైన భారతదేశ భౌగో ళిక, సామాజిక స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన.. మహనీయులు గోపాలకృష్ణ గోఖలే మార్గదర్శనం లో నూతన పోరాట స్వరూపాన్ని సిద్ధం చేసుకుని ముందుకు కదిలారు. 1915 నుంచి 1947 వరకు -అంటే 32 సంవత్సరాల పాటు తన శక్తియుక్తులన్నింటినీ ప్ర యోగాత్మకంగా ఉపయోగించి, బుద్ధుడు అనుసరించిన అహింసా మార్గాన్ని ఆయుధంగా ఎన్నుకోవడం భరతజాతికే గర్వకారణం. కానీ, స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు దాటినా, గాంధీ చూపిన మార్గాలకు చిరునామా ఏది? అనే ప్రశ్న ప్రతి భారతీయుని మనస్సును తొలుస్తోంది.

హింసకు అహింసయే సరైన జవాబు :-- ఇది గాంధీజీ జీవిత సత్యం. హింస వల్ల హింస మరింత పెరిగి వినాశనానికి దారితీస్తుందని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మా డు. బ్రిటీష్ తుపాకుల ముందు అహింసను నిలబెట్టి గెలిచిన మహనీయుడు గాంధీ. కానీ, నేడు ప్రజాస్వామ్యంలో అహింస ఎక్కడ ఉంది?. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల అభిప్రాయాలకు గౌరవం.. చర్చ, సంవాదం, సహనం దాని ప్రాణం. కానీ నేడు మన చర్చల్లో సహనం హరించుకుపోయింది. సోషల్ మీడియా వేదిక ల్లో, టీవీ చర్చల్లో, రాజకీయ వేదికలపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం లేదు. ప్రత్యర్థిని శత్రువుగా చూస్తున్నాం. దూషణ, ద్వేషం, హింసాత్మక ధోరణి పెరిగిపోతోంది.

ఇదేనా గాంధీ కలలు కన్న అహింసా ప్రజాస్వామ్యం?. గాంధీజీ చెప్పి న అహింస అంటే కేవలం మనిషిని కొట్టకుండా ఉండటం మాత్రమే కాదు. మన సులో కూడా హింస ఉండకూడదు. మాట లో, చేతలో, ఆలోచనలో కూడా హింస ఉండకూ డదు. కానీ, నేడు మన రాజకీయాల్లో, కుటుంబాల్లో, సమాజంలో ఈ మానసిక హింస విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎన్నికల్లో గెలవడా నికి హింసను ప్రేరేపించడం, కులమతాల పేరుతో విధ్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యమా?, కాదు.. ఇది ప్రజాస్వామ్యానికి గాంధీజీ తొడిగిన అహింసా కవచాన్ని చిన్నాభిన్నం చేయడమే.

స్వాభిమానం, స్వావలంబన, స్వదేశీ ఎక్కడ? 

గాంధీజీకి స్వదేశీ అంటే కేవలం ఒక వస్తువు కాదు.. అది ఒక ఆత్మగౌరవం, జాతి స్వాభిమానానికి ప్రతీక. పరాయి దేశపు బట్టను బహిరంగంగా తగలబెట్టి, సొంతంగా రాట్నం వడికి ఖాదీ కట్టమన్నాడు. ఎందుకు? మన శ్రమకు విలువ ఇవ్వాలని, మన కార్మికుడి కడుపు నింపాలని, ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలని. కానీ నేడు స్వదేశీ పరిస్థితి ఏమిటి? మన చేతిలో ఫోన్ విదేశీది, మనం వేసుకున్న బట్ట విదేశీ బ్రాండ్, మనం చూస్తున్న వినోదం విదేశీ సంస్కృతి. ‘మేక్ ఇన్ ఇండియా‘ అంటున్నాం.. కానీ ‘మేడ్ ఫర్ ఇండియా‘, ‘మేడ్ బై ఇండియా‘ అనే ఆలోచనను మరిచిపోతున్నాం. మన పల్లెటూరి చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయి. కుమ్మరి, కమ్మరి, నేత పనివారు స్థానికంగా ఉపాధి లేక వలసపోతున్నారు.

స్వదేశీ అంటే కేవలం వస్తువులను ఇక్కడ తయారు చేయడం కాదు.. ఈ దేశపు ఆత్మను, సంస్కృతిని, స్వాభిమానాన్ని కాపాడుకోవడం. గాంధీజీ స్వావలంబనను కోరుకున్నారు. ప్రతి పల్లె ఒక స్వయం సమృద్ధ గణతంత్ర రాజ్యం కావాలన్నారు. పల్లెలోనే ఉత్పత్తి, పల్లెలోనే వినియోగం జరగాలన్నారు. కానీ, నేడు పల్లెలు పట్నాలపై ఆధారపడుతున్నాయి. రైతు తాను పండించిన పంటకు ధర నిర్ణయించలేని దుస్థితి. యువత ఉద్యోగం కోసం విదేశాలకు పరుగులు తీస్తోంది. స్వావలంబన స్థానంలో పరావలంబన పెరిగిపోతోంది.

‘సత్యం’ గాంధీ జీవన సూత్రం :- గాంధీజీకి సత్యమే దేవుడు. ‘సత్యమేవ జయతే‘ అనే వాక్యాన్ని తన జీవితంగా మార్చుకున్నారు. రాజకీయాల్లో సత్యానికి స్థానం ఉండాలని, నాయకుడు ప్రజల ముందు నిజం చెప్పే ధైర్యం చేయాలని నమ్మారు. తన ఆత్మకథనే ‘సత్యంతో నా ప్రయోగాలు‘ అని పేరు పెట్టుకున్నారు. కానీ, నే డు సత్యం పరిస్థితి ఏమిటి? రాజకీయాల్లో సత్యం కన్నా ప్రచారం ప్రధాన మైపో యింది. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందనే సిద్ధాంతం రాజ్యమే లుతోంది. ఎన్నికల హామీలు, గణాంకాలు, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు - సత్యం ఎక్కడో మసకబారిపోతోంది. ప్రజాస్వామ్యంలో సత్యం మూసు కుపోతే, అది ప్రజాస్వామ్యమే కాదు, అది కేవలం అధికార ప్రదర్శన మాత్రమే అవుతుంది.

మహాత్ముడి మార్గాలు ఎక్కడ?:- --స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా మహాత్ముడి మార్గాలు ఎందుకు మూసుకుపోతున్నాయి?. కారణం ఒకటే.. - మనం గాంధీజీని విగ్రహంగా మార్చాం, ఆచరణగా మార్చుకోలేదు. ప్రతి జయంతి, వర్ధంతికి ఆయన ఫొటోకు దండ వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయ న సిద్ధాంతాలను మర్చిపోతున్నాం. పాఠ్యపుస్తకాల్లో గాంధీజీ ఉన్నారు, కానీ పాలనా పుస్తకాల్లో, మన విధానాల్లో ఆయన లేరు.గాంధీజీ మార్గం కష్టమైన మార్గం. సత్యం పలకడం, అహింసను పాటించడం, స్వదేశీని ఆచరించడం కష్టంగా మారింది. హింస, అబద్ధం, పరాయి వస్తువులపై ఆధారపడటం వంటి సులభమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాం. అందుకే గాంధీ మార్గాలు మూసుకుపోతున్నట్లు కనిపిస్తున్నాయి. 

కానీ, ఒకటి గుర్తుంచుకోవాలి..- గాంధీజీ చెప్పిన మార్గం మూసుకుపోలేదు, మనం మూసివేస్తున్నాం. ఆ మార్గం ఇప్పటికీ తెరిచే ఉంది. ప్రపంచం మొత్తం హింసతో అలసిపోయినప్పుడు, పర్యావరణ కాలుష్యంతో, ఆర్థిక అసమానతలతో సతమతమవుతున్నప్పుడు, ప్రపంచం మళ్లీ గాంధీ వైపే ఆశగా చూస్తోంది. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినంగా ప్రకటించింది అందుకే. అమెరికాలో మార్టిన్ లూథర్‌కింగ్ నుంచి దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా వరకు గాంధీ చూపిన అహింసా మార్గాన్నే అనుసరించారు.

స్వదేశీ అంటే మన ఊరి ఉత్పత్తిని కొనడం, సత్యం అంటే మన మనస్సాక్షికి నిజాయితీగా ఉండటం, అహింస అంటే ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం. ఈ మూడింటినీ మన ఇంటి నుంచి, మన నుంచే మొదలుపెడదాం. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఓటు వేసే పండుగగా కాకుండా.. సత్యం, అహింస, స్వావలంబనను ప్రతి రోజూ ఆచరించే జీవన విధా నంగా మార్చుకుందాం.అప్పుడే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం.. -కేవలం రాజకీయ స్వరాజ్యం మాత్రమే కాదు.. ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక స్వరాజ్యం కూడా సాధ్యమవుతుంది. అదే మహాత్మునికి మనం అర్పించే నిజమైన నివాళి.

గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ప్రధాన సలహాదారు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీటీఎస్)

కె.గోపాల్‌జీ

మరిన్ని వార్తలు