గణేష్ ఉత్సవ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి
వర్ష సూచనల నేపథ్యంలో బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ సూచనలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గణేష్ ఉత్సవ కమిటీలు(Ganesh Utsav Committees), ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ (Burgampadu SI Meda Prasad)సూచించారు. విగ్రహాల నిమజ్జన ఊరేగింపులను వీలైనంత త్వరగా ముగించుకోవాలని కోరారు.ప్రధాన రహదారుల్లో ఊరేగింపుల సందర్భంగా రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ వైర్లను పైకి ఎత్తే సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా విద్యుత్ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గోదావరి నది, చెరువులు, కుంటలు, కాలువల వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. పోలీసు, ప్రభుత్వ శాఖలకు సహకరిస్తూ వేడుకలను సురక్షితంగా ముగించుకోవాలని ఎస్ఐ కోరారు.