5 September, 2026 | 8:37 PM

రాజాపూర్ సమస్య పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ వద్దు

05-09-2026 | 07:06pm

కలెక్టర్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

సెప్టెంబర్ 16న జరగనున్న ఎంక్వైరీ నిలిపివేయాలని సూచన

మంథని, సెప్టెంబర్ 5(విజయ క్రాంతి): ఆర్జీ-3 ఓసీపీ-2 విస్తరణలో భాగంగా భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన రాజాపూర్ గ్రామ ప్రజల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు అవార్డు ఎంక్వైరీ(Award Inquiry) నిర్వహించవద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) జిల్లా కలెక్టర్‌(Collector)కు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్జీ-3 ఓసీపీ-2 విస్తరణలో భాగంగా రాజాపూర్ గ్రామంతో పాటు సుమారు 451 ఎకరాల భూమిని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో గత ఏడాది నవంబర్‌లో రిక్విజిషన్ వచ్చినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు. అనంతరం డిసెంబర్‌లో రెవెన్యూ, సింగరేణి అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి ప్రాజెక్టు నంబర్లు కేటాయించారు.

అయితే నంబర్ల కేటాయింపు సమయంలో రాజాపూర్ పరిధిలోని ఇండ్లను, ఇతర అంశాలను ఆర్‌పీఎన్, ఆర్‌టిహెచ్ అనే రెండు విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. కానీ జనవరిలో జారీ చేసిన పబ్లిక్ నోటిఫికేషన్‌లో ఆర్‌పీఎన్ నంబర్లను మాత్రమే చేర్చి, ఆర్‌టిహెచ్ నంబర్లను చేర్చకపోవడంతో సుమారు 500 కుటుంబాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోయిందని పేర్కొన్నారు.

ఈ సమస్యను రాజాపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పలుమార్లు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో ఆగస్టులో మరోసారి పబ్లిక్ డిక్లరేషన్ జారీ కాగా, ఈ నెల 16వ తేదీన అవార్డు ఎంక్వైరీకి హాజరు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

తాజాగా గ్రామ ప్రజల సమస్యను మరోసారి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సెప్టెంబర్ 16న నిర్వహించనున్న అవార్డు ఎంక్వైరీని నిలిపివేయాలని, రాజాపూర్ గ్రామానికి సంబంధించిన సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఎలాంటి అవార్డు ఎంక్వైరీ నిర్వహించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రజల సమస్యపై వెంటనే స్పందించి, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రాజాపూర్ గ్రామ ప్రజల తరఫున సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు