వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్టుల సమావేశం
- జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
- వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి.
- హెల్త్ కార్డులు అందించి ఆరోగ్య భద్రత కల్పించాలి.
- జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.
తిరుమలాయపాలెం న్యూస్: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం (Government) ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తిరుమలాయపాలెం(Tirumalayapalem) మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పసలాది సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు కోరారు. వార్షికోత్సవం సందర్భంగా తిరుమలాయపాలెం మండల ప్రెస్‌క్లబ్ కార్యాలయ ఆవరణలో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పసలాది సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్త్ కార్డులు అందించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు.సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పోలేపొంగు నాగరాజు, ట్రెజరర్ ఉబ్బని సుందర్ రావు, ప్రచార కార్యదర్శి గుజ్జ రామకృష్ణ, గౌరవ సలహాదారులు మేకల నాగరాజు, కూరపాటి విజయ్, కొలిశెట్టి వేణు, ఎడవల్లి నాగరాజు, గోవింద సురేష్,గాదారి బాబు, గాదారి వెంకన్న, కామల్ల వీరయ్య, మెట్టు రుద్రరాజు, పుల్లూరి ప్రభాకర్, ఏలూరి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.