తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి

09-09-2026 | 02:27pm

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి) : తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములులతో కలిసి హాజరై కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతిధ్వనిగా కాళోజి నారాయణరావు తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితులని అన్నారు. తెలంగాణ వైతాళికుడిగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా జీవించాడని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థి దశలోనే నిజాంను ఎదిరించి తెలంగాణలో విద్యా వ్యాప్తికి కృషి చేశారని, తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాళోజీ నారాయణరావు బహు బాషా కోవిదులు అని, కవిగా, రచయితగా తెలుగుతో పాటు వివిధ భాషలలో హ్యూమన్ రైట్స్, కుల వివక్ష లేని సమాజంపై రచనలు చేశారని తెలిపారు.

మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్ పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు