ఆపదలో ఆపద్బాంధవుడు
(ఖమ్మం,విజయ క్రాంతి): విధి నిర్వహణ ముగించుకుని తిరిగి వెళ్తున్న ఖమ్మం డీసీహెచ్‌ఎస్ డాక్టర్(DCHS Doctor) రాజశేఖర్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చూసి మానవత్వంతో స్పందించారు.కలెక్టరేట్(Collectorate) సమీపంలో జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అభిషేక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.వాటర్ క్యాన్లతో వెళ్తున్న ఆటో ట్రాలీ ప్రమాదానికి గురికావడంతో అభిషేక్ రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయాడు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడ గుమిగూడారు.అదే సమయంలో కలెక్టరేట్‌లో విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ అక్కడి పరిస్థితిని గమనించారు.
వెంటనే తన వాహనాన్ని ఆపి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.అప్పటికే అటువైపు నుంచి 108అంబులెన్స్ వెళ్లినప్పటికీ ప్రమాద బాధితుడిని తరలించకపోవడంతో, పరిస్థితిని గమనించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాయపడిన అభిషేక్‌ను తన కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి చేరుకున్న అనంతరం బాధితుడి పరిస్థితిని స్వయంగా పరిశీలించగా ఈ ప్రమాదంలో అభిషేక్ కుడి తొడ భాగం విరిగినట్లుగా గుర్తించి అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుని, బాధితుడి పరిస్థితిని పర్యవేక్షించారు.
ఒక జిల్లా స్థాయి వైద్యాధికారిగా తన విధులకే పరిమితం కాకుండా,ఆపదలో ఉన్న ఓ అపరిచితుడిని సొంత మనిషిలా భావించి తక్షణమే స్పందించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ తీరు పలువురి ప్రశంసలు అందుకుంది.పరిచయం లేదు.. ప్రాంతం తెలియదు.. అయినా ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడాలనే మానవత్వంతో ముందడుగు వేశారు. వైద్యుడిగా తన బాధ్యతను ఆస్పత్రి గోడలకే పరిమితం చేయకుండా, రోడ్డుపైనే ఆచరణలో చూపించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలిచింది.“వైద్యానికి ఎల్లలు లేవు.. మానవత్వానికి హద్దులు లేవు” అన్న మాటకు డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్పందన ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది