ఐదిటికీ ఒక్కరే!

30-09-2026 | 05:55am

పశుసంవర్ధక అడిషనల్ డైరెక్టర్‌కు అదనంగా నాలుగు బాధ్యతలు

అదనపు భారంతో రివ్యూలకు దూరం.. పేరుకుపోతున్న ఫైళ్లు

అధికారి ఏ ఆఫీసులో ఉంటారో తెలియక సిబ్బందికి ఇబ్బంది 

కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం 

ముందుకుసాగని పదోన్నతులు, సర్వీసు వ్యవహారాలు 

డిపార్ట్‌మెంట్లలో గాడి తప్పుతున్న పాలన

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో(Government department) ఇన్‌చార్జ్ అధికారులతోనే పాలన సాగుతున్నది. పూర్తిస్థాయి అధికారులు లేకపోవ డంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమవుతున్నది. దీంతో పదోన్నతులు, సర్వీసు వ్యవహారాలు, పరిపాలనా ఫైళ్ల పరిష్కా రం, సంస్థల రోజువారీ నిర్ణయాలపై జాప్యం నెలకొంటున్నది. పశువైద్య-, పశుసంవర్ధక శాఖ(Veterinary and Animal Husbandry Department) అదనపు సంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న సుబ్బారాయుడికి మరో నాలుగు బాధ్యతలు ఇవ్వడంతో ఆయా డిపార్‌మెంట్లలోని ఫైల్స్ ముందుకు కదలడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

సుబ్బారాయిడికి అదనంగా తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ(Telangana Livestock Development Agency) (టీజీఎల్డీఏ) సీఈఓగా, తెలంగాణ గొర్రెలు(Telangana sheep) -మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ (ఎఫ్‌ఏసీ)గా, వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రార్‌గా, ఇందిరా డెయిరీ(మధిర)కి ఎండీగా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఒకే అధికారి ఐదు డిపార్ట్‌మెంట్లను చూడాల్సి రావడంతో ఆయనపై పనిభారం పెరుగుతున్నదని, దీంతో రివ్యూలు కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నదని ఉద్యోగులు అంటున్నారు. 

సమన్వయం చేసుకోవాలి..!

పశుసంవర్ధక శాఖ పరిధి పెద్దది కావడంతో పాటు నిత్యం సమాజంతో ముడి పడి ఉంటుంది. అయితే, ఒక అధికారికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు కీలకమైన బాధ్యతలు ఇవ్వడంతో ఆయా డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన పలు వ్యవహారాలు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పదోన్నతులు(Employee promotions), సర్వీసు సంబంధిత అంశాలు, పరిపాలనా ఫైళ్ల పరిష్కారం, సంస్థల నిర్ణయాలు వేగంగా ముం దుకు సాగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రం లో 1,270 మంది గ్రాడ్యుయేట్ వెటర్నరీ వైద్యులు(Graduate veterinary doctors), 2,091 మంది పారా వెటర్నరీ సిబ్బంది, 3,969 మంది హాస్పిటల్ అటెండెంట్లు పనిచేస్తున్నారు. 2,160 వెటర్నరీ సంస్థల నెట్‌వర్క్ ఉంది. ఇలాంటి విస్తృత వ్యవస్థలో అదనపు సంచాలకుడి బాధ్యత లతో పాటు ఇతర సంస్థల ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించడం వల్ల పరిపాలనా భారం పెరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు శాఖాపరమైన నిర్ణయాలు.. మరోవైపు సంస్థల పరిపాలన.. ఇంకోవైపు ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు.. అన్నింటినీ ఒక్కరే సమన్వయం చేసుకోవాల్సి పరిస్థితి.  

సమీక్షలు లేవ్..!

అధికారి అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక కార్యాలయంలో పని కోసం వెళ్లేసరికి మరో సంస్థకు సంబంధించిన సమావేశంలో ఆయన ఉంటారని, ఫైల్‌పై సంతకం కోసం వచ్చిన వాళ్లకు అందుబాటులో ఉండటం లేదని కొందరు ఉద్యోగులు అంటున్నారు. ఏ సమస్య కోసం ఎవరిని కలవాలో, ఏ కార్యాలయంలో అధికారి అందుబాటులో ఉంటారో స్పష్టత ఉండడం లేదు. ఒక పని కోసం పలుమార్లు తిరగాల్సి వస్తున్నదని సంబంధిత సంస్థల ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెలకొకసారైనా అధికారులు రివ్యూలు చేయాల్సి ఉంటుంది.

కిందిస్థాయిలో సిబ్బంది  పనితీరు.. పెండింగ్ అంశాలు, నిధులు, డెవలప్ మెంట్ తదితర అంశాలపై సమీక్షించాల్సి ఉంటుంది. అయితే సంబంధిత ఇన్‌చార్జ్ అధికారి సుబ్బారాయుడు మాత్రం రివ్యూలు నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పని ఒత్తిడి వల్ల ఆయన అందుబాటులో ఉండటంలేదని ఉద్యోగులు అంటున్నారు. ఫలితంగా డిపార్ట్‌మెంట్లలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగుల సర్వీసు అంశాలతో పాటు పరిపాలనా ఫైళ్లు కూడా పెండింగ్‌లో పేరుకుపోతున్నట్లు సమాచారం. పశుసంవర్ధక, లైవ్‌స్టాక్ డెవలప్మెంట్, గొర్రెలు, -మేకల అభివృద్ధి వంటి విభాగాలు పరస్పరం సంబంధం ఉన్నప్పటికీ.. వాటికి వేర్వేరు పరిపాలనా బాధ్యతలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో కీలక పోస్టులకు పూర్తి స్థాయి అధికారులను నియమించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు