ఓ తల్లి ప్రాణం.. ఆ కొడుకు ఆరాటం
మంచిర్యాల క్రైమ్,సెప్టెంబర్ 30 : తన తల్లి ప్రాణాలు కాపాడుకోవాలని ఓ కొడుకు వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రి(District Hospital)కి వెళితే పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం ఎమ్మెల్యే ఇంటికి తల్లిని వీల్ చైర్ పై తీసుకొని వెళ్ళిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా బుజ్జి (55) కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. మంగళవారం రాత్రి బుజ్జి తీవ్ర అస్వస్థతకు గురికాగా వైద్యం కోసం కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అయితే అత్యవసర పరిస్థితిలో ఉన్న తన తల్లికి చికిత్స అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేశారని రాజ్‌కుమార్ ఆరోపించాడు. బెడ్ ఇవ్వాలని కోరినా స్పందించలేదని, ఈ క్రమంలో తనపై సిబ్బంది దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తల్లి బాధను చూడలేక, సహాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితిలో రాజ్‌కుమార్ ఆమెను వీల్‌చైర్‌పై కూర్చోబెట్టి రాత్రివేళ ఆసుపత్రి నుంచి కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(MLA Kokkirala Premsagar Rao) నివాసానికి తీసుకెళ్లాడు. తల్లి ఆరోగ్యం కోసం అర్ధరాత్రి సమయంలో కుమారుడు పడిన తపన అక్కడి వారిని కలచివేసింది. అయితే వారు చేరుకునే సమయానికి ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో అక్కడి సిబ్బంది బాధిత కుటుంబంతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎట్టకేలకు స్పందించారు.
సమాచారం అందించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీధర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని తల్లీకొడుకులతో మాట్లాడారు. తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి వారిని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అత్యవసర సమయంలో వైద్యం కోసం ఓ తల్లి వీల్‌చైర్‌లో, ఆమెను తీసుకుని అర్ధరాత్రి సహాయం కోసం తిరిగిన కుమారుడి పరిస్థితి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రోగులకు సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రి యంత్రాంగం మరింత మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.