బొగ్గు కొరత తీవ్రం

30-09-2026 | 05:25am
  1. రోజుకు 31.35 లక్షల టన్నుల అవసరం.. సరఫరా 23.96 లక్షల టన్నులే!
  2.   81 థర్మల్ పవర్ ప్లాంట్లు క్రిటికల్ కేటగిరీలోకి!
  3. ఇప్పటికే మూతపడ్డ పలు కేంద్రాలు
  4. తెలంగాణలోని ఇదే గడ్డు పరిస్థితి

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా బొగ్గు కొరత(Coal shortage) తీవ్రమవుతున్నది. జాతీయ స్థాయిలో ప్రధానంగా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికే(Thermal power generation) అత్యధికంగా బొగ్గును కేటాయిస్తున్నప్పటికీ.. ప్రతిరోజూ అవసరమైనంత మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కనీసం 18 నుంచి 20 రోజుల వరకు కావాల్సిన బొగ్గును నిల్వ చేసుకోవాలని సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ(Central Electricity Authority) (సీఈఏ) స్పష్టమైన నిబంధనలను పెట్టినప్పటికీ.. దేశంలోని బొగ్గు ఉత్పత్తి ఆ దిశగా సాగకపోవడంతో రోజురోజుకూ  పరిస్థితి దిగజారిపోతున్నది. ఓవర్ హాలింగ్(Overhauling), సాంకేతిక ఇబ్బందులంటూ.. పలు కారణాలతో దేశంలో ఇప్పటికే పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశారు. తెలంగాణలో సింగరేణి సంస్థ ఉన్నప్పటికీ.. తెలంగాణలోని థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కూడా ఇబ్బందులుపడుతున్నాయి. 

మూడో వంతు బొగ్గు మాత్రమే!

దేశ వ్యాప్తంగా చూస్తే మొత్తం 225188 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 191 థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీకూడా 85 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో కేవలం దేశ సగటు 68 శాతం పీఎల్‌ఎఫ్‌తోనే థర్మల్ విద్యుత్తు కేంద్రాలు పనిచేస్తున్నాయని సీఈఏ స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం కేవలం కావాల్సినంత బొగ్గు అందుబాటులో ఉండకపోవడమేనని విద్యుత్తు వర్గాలు అంటున్నాయి.  వాస్తవానికి ప్రతిరోజూ దేశంలోని 191 థర్మల్ ప్లాంట్లకు 31,35,100 టన్నుల బొగ్గు (85 శాతం పీఎల్‌ఎఫ్ ప్రకారం) కావాలి.

అయితే ఈ స్థాయిలో ప్రతిరోజూ బొగ్గు సరఫరా కావడం లేదు. ఈ నెల 28న చూసుకుంటే కేవలం 23,96,300 టన్నుల బొగ్గు సరఫరా అయింది. అంటే.. కనీసం ఏ రోజుకు సరిపడా బొగ్గు ఆరోజుకూడా సరఫరా కావడం లేదు. అందుకే పీఎల్‌ఎఫ్‌ను తగ్గించి (సెప్టెంబర్ నెలలో సగటును 68 శాతం పీఎల్‌ఎఫ్ నమోదైంది) థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నడిపిస్తున్నారు. 85 శాతం పీఎల్‌ఎఫ్ అనేది సీఈఏ నిబంధన. దీని ప్రకారమే ప్రతి థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌లోనూ.. కనీసం 18 నుంచి 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని స్పష్టంగా సూచించింది.

అయితే ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న 191 థర్మల్ ప్లాంట్లలో 18 రోజులకు సరిపడేలా 5,78,57,500 టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం (ఈ నెల 28 నాటికి) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్ ప్లాంట్లలో కలుపుకొని 2,16,67,000 టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 28న 25.75 లక్షల టన్నుల బొగ్గును దేశ వ్యాప్తంగా వినియోగిస్తే (68 పీఎల్‌ఎఫ్‌తో) ఆ రోజు సరఫరా అయిన బొగ్గు 23.96 లక్షల టన్నులు మాత్రమే. అంటే రోజుకు సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు తగ్గిపోతున్నది. మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉంటున్నది. 

తెలంగాణలోనూ అదే పరిస్థితి..

సింగరేణి ఉన్నప్పటికీ తెలంగాణలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడకూడా బొగ్గు కొరత వేధిస్తున్నది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలోని రెండు థర్మల్ విద్యుత్తు కేంద్రాల సామర్థ్యం 4,200 మెగావాట్లు. ఇక్కడ సగటున 70 శాతం పీఎల్‌ఎఫ్‌తోనే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రెండింటిలోనూ 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు దాదాపు 8 లక్షల టన్నులు ఉండాలి. కానీ 2.22 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రతిరోజూ ఈ రెండు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో కలిపి 42.5 వేల టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా, అంతకంటే తక్కువగానే అంటే.. 40.7 వేల టన్నుల (ఈ నెల 28న) బొగ్గు మాత్రమే సరఫరా అవుతున్నది. దీనితో ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో 27 శాతం మాత్రమే ఉందని సీఈఏ కూడా స్పష్టంగా చెప్తున్నది. తెలంగాణ జెన్‌కో (సింగరేణితోపాటు) ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం థర్మల్ విద్యుత్తు కేంద్రాల సామర్థ్యం మొత్తం 8,380 మెగావాట్లు. బొగ్గు కొరత కారణంగా వీటిని కేవలం 53 శాతం పీఎల్‌ఎఫ్‌తోనే నడిపిస్తున్నారు. వీటిలో 20 రోజులకు సరిపడా నిల్వలు 19.64 లక్షల టన్నుల బొగ్గు ఉండాల్సి ఉండగా.. 5.70 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. పైగా బొగ్గు నాణ్యత నేపథ్యంలో యాదాద్రి థర్మల్  పవర్ స్టేషన్ క్రిటికల్ కేటగిరీలోకి వెళ్లింది. పలు కారణాలతో మొత్తం దేశవ్యాప్తంగా 81 థర్మల్ పవర్ ప్లాంట్లు క్రిటికల్ కేటగిరీలోకి వెళ్లాయి. 

సరిపడా బొగ్గు ఏదీ..?

దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిని పరిశీలిస్తే.. ప్రధానంగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలతోపాటు సిమెంటు, స్టీలు, సీపీపీ, స్పాంజ్ ఐరన్, ఇతర రంగాలకు బొగ్గు అత్యవసరం. బొగ్గు లేకపోతే ఇవన్నీ మూతపడక తప్పదు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి సంస్థలు అయిన కోల్ ఇండియా, సింగరేణి, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లాంటి బొగ్గు ఉత్పత్తి సంస్థలన్నీ కలిపి 2026 ఆగస్టు నెలలో 81.87 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయి. ఇదే నెలలో ఉత్పత్తి అయిన మొత్తాన్ని 81.87 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేశాయి. ఇందులో థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు 65.63 మిలియన్ టన్నులుగా ఉంది. అయితే ఇది సరిపోవడం లేదు. దీనితో 18 నుంచి 20 రోజుల నిల్వలు అందుబాటులో ఉంచడం కూడా కనాకష్టంగా తయారవుతున్నది. 

జెన్‌కో కేంద్రాలకు రోజూ 75 వేల టన్నులు!

తెలంగాణలోని  జెన్‌కో ఆధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు రోజుకు అవసరమైన 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మంగళవారం సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోగి, జెన్‌కో సీఎండీ హరీష్‌లు ఎల్‌నినో నేపథ్యంలో విద్యుత్తు ఉత్పత్తి, బొగ్గు సరఫరాలపై పరిస్థితులపై సమీక్షించారు. పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు తగ్గట్టు జెన్‌కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రస్తుతం బొగ్గు సరఫరా, నాణ్యత, రవాణాలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. రోజుకు 14 రైల్వే రేకుల ద్వారా 56 వేల టన్నులు, రోడ్డు మార్గంలో 19.5 వేల టన్నులు సరఫరా చేసే ప్రణాళికపై చర్చించారు. యాదాద్రి ప్లాంట్‌కు 34 వేట టన్నుల బొగ్గు అవసరంపై చర్చించారు. ఒడిశాలోని నైనీ నుంచి రోజుకు 8 వేల టన్నులు, ఇతర గనుల నుంచి 36 వేల టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. 

మరిన్ని వార్తలు