విచారణకు సిద్ధమా?
- నా ఆస్తులు, రేవంత్ కుటుంబ ఆస్తులు తేలాలి
- 2009 ఎన్నికల అఫిడవిట్లోనే నాకు హోటల్ ఉందని చెప్పాను
- వాస్కోడిగామా, కొలంబస్ కనుగొన్నట్టు సీఎం ఇప్పుడు చెబుతున్నడు
- నా హోటళ్లకు రేవంత్‌రెడ్డి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తన ఆస్తులపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సవాల్ చేశారు. ‘మా తాత ల ఆస్తుల నుంచి మీ తాతల ఆస్తుల వరకు విచారణ చేయండి’ అని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి లాగా మంది మీద పడి దోచుకునే అలవాటు తనకులేదన్నారు. తెలంగాణలో రైతులు, చేనేత కార్మికులు, యువత, బీసీలు, దళితులు, మైనారిటీలు సహా అన్నివర్గాల ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేశారని అన్నారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి నల్లమల పులి అని చెప్పుకుంటడు.. నాలుగు వేల మంది పోలీసులను పెట్టుకుని సిరిసిల్లకు పోతాడా? నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు పిల్లివి’ అని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్ల పర్యటనలో సీఎం చుట్టూ పోలీసులు తప్ప ప్రజలు కనిపించలేదని, బీఆర్ఎస్ నాయకులను ముందుగానే అరెస్టు చేసి, దుకాణాలు మూసివేయించారని మండిపడ్డారు. కేసీఆర్ తనను చిన్నప్పటినుంచి బాగా చదువుకోవాలని చెప్పేవారని, తాను చదువుకుని అమెరికాలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు.
2006లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో హోట ల్ ప్రారంభించానని, 2009 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, వ్యాపార వివరా లను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు. నేను అఫిడవిట్లో చెప్పిన విషయాన్నే మళ్లీ వాస్కోడిగామా, కొలంబస్ కనుగొన్నట్టు సీఎం చెబుతున్నరు అని ఎద్దేవా చేశారు. వ్యాపారం చేసుకోవటడం తప్పా అని ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.
వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మె ల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2006లో హోటల్ పెడితే 20 ఏళ్లకు మూడు హోటళ్లు అయ్యాయని, నేను సరిగా పట్టించుకుని ఉంటే పది హోటళ్లు చేసేవాడిని అన్నారు. నా హోటళ్లకు రేవంత్‌రెడ్డి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు సంతోషమన్నారు.
వెనకటి రోజులు తెస్తా అన్నడు.. తెచ్చిండు..
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలు గోస పడుతున్నారని తెలిపారు. ఆరు గంటలు కూడా కరెంట్ రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని, రైతుబంధు రావడం లేదని, యూరియా దొరక డం లేదని కంటతడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఫోన్ చేస్తే యూరియా పొలం వద్దకే వచ్చేద ని రైతులు గుర్తు చేసుకుంటున్నారని అన్నా రు. ప్రజలు తమ పక్షాన నిలబడి ఈ ప్రభుత్వంపై పోరాడాలని కోరుతున్నారని చెప్పారు.
‘కేసీఆర్‌గారు ఆనాడే చెప్పారు.. మోసపోకండి.. మోసపోతే గోసపడ్తం అని. ఇవాళ అన్నివర్గాల ప్రజలు గోసపడుతున్నరు’ అని వ్యాఖ్యానించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ రైతులను ఇబ్బంది పెట్టిందని, అదే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి వెనకటి రోజులు మళ్లీతెస్తా అని చెప్పారని, ఇప్పు డు సాగునీరు లేని రోజులు, కరెంట్ రాని రోజులు తిరిగి తెచ్చారని విమర్శించారు. ప్రజలు మోసం చేసేవాళ్లనే నమ్ముతారని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిందన్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారని, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేశారని, ఫార్ములా- వ్యవహారంపై కేసులు పెట్టారని, బ్యాంకు ఖాతాల వ్యవహారాలపై విచారణ జరిపారని, అయితే వీటి నుంచి ఏమి తేల్చారని ప్రశ్నించారు. ప్రజల మనసు ఖాళీగా ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు గుర్తుకొస్తాయని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న నేతన్నలకు పరిహారమేది?
సిరిసిల్ల పర్యటనలో సీఎం చేనేత కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా వెళ్లారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో పలువురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకు న్నారని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, విద్యార్థుల స్కూల్ యూనిఫాం ఆర్డర్లు నిలిచిపోయాయని, నేతన్న బీమా పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారని, నేతన్న బీమాపై ప్రకటన చేస్తారని ఆశించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
సీఎం సిరిసిల్లలో భారీ సంఖ్య లో పోలీసులను మోహరించి పర్యటించడం ప్రజల మధ్య పర్యటనలా లేద ని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులు, సన్నిహితు లకు సంబంధించిన వ్యాపారాలు, టెండర్లు, భూముల వ్యవహారాలపై కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కంపె నీకి అర్హత లేకపోయినా భారీ విలువైన టెం డర్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తొమ్మి దో తరగతి ఫెయిలైన కొండల్‌రెడ్డి ఏరోస్పేస్ ఇంజినీర్ ఎలా అయ్యాడో, ఏరోస్పేస్ రం గంలో ఆయనకొచ్చిన అవకాశాలపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థమైతలేదని, నిన్నటి వరకు పెద్దగా ఆస్తులు లేని కుటుంబ సభ్యులు వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతున్నారని ప్రశ్నించినందుకే సీఎంకు కోపం వస్తోందన్నారు. ౩నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఎన్ని హామీలు అమలుచేశారని ప్రశ్నించారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారని, బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి ఎంత నిధు లు కేటాయించారని నిలదీశారు. బీసీలకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారని, రాష్ట్రంలో కాంట్రాక్టులు ఎవరికి దక్కుతున్నాయని ప్రశ్నించారు.
మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పా లని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్, ప్రతి ఇంటికి నల్లా, ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి హామీ ల పరిస్థితి ఏమిటని నిలదీశారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ పాటలు, కేసీఆర్‌కు సంబంధించిన పాటలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అని అన్నారు. అమ్మ వి లువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తది అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ నాశనమని, తె లుగుదేశంలో అడుగుపెట్టి దాన్ని బొందపెట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే 25 ఏళ్లు మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా చేసి పో తడని, కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రైతులు, చేనేత కార్మికులు, యువత, బీసీలు, దళితులు, మై నారిటీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హా మీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.
కేటీఆర్ బ్రాండ్ ఐటీ... రేవంత్ బ్రాండ్ లూటీ: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆ ర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ బ్రాండ్ ఐటీ రేవం త్ బ్రాండ్ లూటీ అని పేర్కొన్నారు. పొద్దు న లేస్తే కేసీఆర్ ఫ్యామిలీని వ్యక్తిత్వ హ ననం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయానికి ప్రజలే ఖననం చేస్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్, టీడీపీల హయంలోనే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని మండిపడ్డారు. కేటీఆర్ హయంలో సిరిసిల్ల సిరులొలికే జిల్లా గా మారిందని, సిరిసిల్ల చేనేతల తలరాత మార్చిన అభినవ బ్రహ్మ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని ఆయన పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి సిగ్గూ శరం లేకుండా సిరిసిల్ల పోయి మసిబూసి మారేడు కాయ చేసే కుట్ర చేసిండని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో సంక్షేమంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వెలుగులు విరజిమ్మితే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్లీ సంక్షోభంలోకి చేనేతలు వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు.
చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ని ర్వాకం వల్లే ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికులు మళ్ళీ బలవన్మరణాలకు పా ల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా విలసిల్లిన సిరిసిల్లకు ఉరివేసిన రేవంత్‌రెడ్డి ఏ మొఖం పెట్టుకొని సిరిసిల్లకు పోయినవని నిప్పులు చెరిగారు. ఎన్ని రాజకీయ శ క్తులు కలిసినా, మరెన్ని కుట్రలు చేసినా సిరిసిల్ల ప్రజలు ఎప్పటికీ కేటీఆర్‌కే పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా ఎప్పటికీ బీఆర్ఎస్ ఖిఆర్ఎస్ అని అభివర్ణించారు.
ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగిరే యడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో వార్ వన్ సైడే, కారు జెట్ స్పీడ్‌ను ఆపలేరు అన్నా రు. బీఆర్ఎస్కు పడే తెలంగాణ ఓట్ల ముందు కాంగ్రెస్ నోట్లు నిలవ లేవన్నా రు. నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధమని, బీఆర్ఎస్ పార్టీకి తొలి అధికార పదవినందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయడంలోనూ నిజామాబాద్ జిల్లాదే ప్రధాన పా త్ర అని, ‘ఇందూరు జిల్లా పంతం, ఇందిరమ్మ హింసారాజ్యం అంతం’ అని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి అంటేనే ఫాదర్ ఆఫ్ లయ్యర్, తెలంగాణ ప్రజలను హింస పెడుతున్న అభినవ డయ్యర్ అని ఆయన అభివర్ణించారు. దేవుళ్ళకే శఠగోపం పెట్టిన ఘనుడు అని, ప్రజలను కొట్టడం, కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ రెడ్డికి తెలుసని ఆ యన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు మహా వృక్ష మన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవడబ్బతరం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ 1000/కేవీ సబ్-స్టేషన్లు, టచ్ చేస్తే మాడి మసై పోతావు, కేసీఆర్ ఫ్యామి లీ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమవుతుంది, కేసీఆర్‌తో గోక్కున్న వారెవరూ బాగుపడలేదు, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేవు అని హెచ్చరించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, కాంగ్రెస్ స ర్కారుకు పోలీసుల వత్తాసు పలుకుతున్నారని, అందరి పేర్లు పింక్ బుక్‌లో ఎక్కి స్తున్నామని, వచ్చేది కేసీఆర్ రాజ్యమేనని, ఒక్కొక్కరి లెక్కలు తెలుస్తామన్నారు. కేసీఆర్ హయాంలో’ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం’ కనిపిస్తే కాంగ్రెస్ హయాంలో’ ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం తాండవిస్తోందన్నారు. ఆ రు గ్యారెంటీలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యా మిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారు, సారు కేసీఆర్ రావాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కలలుగనకు రేవంత్ రెడ్డి అని హితవు పలికారు.