మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క సమీక్ష...
- మల్లూరు క్షేత్రంలో పర్యటించి అభివృద్ధి పనుల డిజైన్ ఖరారు చేయాలని నిర్ణయం
- దేవాలయ పవిత్రత కాపాడుతూ పనులు చేయాలి
ములుగు, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని(Lakshmi Narasimha Swamy Temple) మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Rural Development Minister Seethakka) దేవాలయ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో రాష్ట్ర సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు ప్రముఖ ఆర్కిటెక్టులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రస్తుత పరిస్థితి, భక్తుల రాకపోకలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, మల్లూరు క్షేత్ర ప్రాశస్త్యం, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు.
అభివృద్ధి పనులలో భాగంగా కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం వంటి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించి, వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దేవాలయ ప్రధాన నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్ర పవిత్రతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణ స్వరూపం, పరిసర ప్రాంతాల ప్రత్యేకత, భక్తుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆర్కిటెక్టులు, అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేసేందుకు త్వరలో మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం దేవాలయ అభివృద్ధికి అనువైన డిజైన్‌ను ఖరారు చేయనున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రాక్ టెస్ట్‌ను త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించారు. రాక్ టెస్ట్ నివేదిక ఆధారంగా తదుపరి నిర్మాణ పనులకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఖరారు చేయనున్నారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, సమన్వయంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాలని అధికారులకు సూచించారు.