స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి

09-09-2026 | 05:15am

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్ నేతలు

సిద్దిపేట, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్కుమ్పా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.

స్పీకర్ను దూషించిన ఎమ్మెల్సీలను వెంటనే బీఆర్‌ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట రూరల్ పోలీస్స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉండటం సహజమేనని, అయితే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.

తాతా మధు, నవీన్కుమార్రెడ్డి తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులను బీఆర్‌ఎస్ నాయకత్వం మొదటి నుంచి చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ దళిత వ్యతిరేక వైఖరిని అవలంబించారని విమర్శించారు.

ప్రజలు బీఆర్‌ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని, అధికారం కోసం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తూ ప్రజా సమస్యలపై చర్చకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రజలు బీఆర్‌ఎస్ నేతల తీరును గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, ముద్దం లక్ష్మి, దాస అంజయ్య, కలిముద్దీన్, రాశాద గయాజుద్దీన్, విజయ్, డానియల్, వహాబ్, సంతోషి, బర్మా రామచంద్ర, రాములు, రాజ్బహదూర్రెడ్డి, వంశీ, సనా, రజినీ లహరి, దస్తగీర్, దేశెట్టి నరేష్, పవన్, చందు, శ్రీనివాస్, కర్ణాకర్, రఘుపతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు