పాఠశాలల్లో పచ్చని విప్లవానికి శ్రీకారం
విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే పాఠశాల వ్యవస్థలో ప్రకృతికి, మట్టికి అనుబంధం.. పర్యావరణ పరిరక్షణపై పాఠ్యపుస్తకాల్లో చదవడం ఒక ఎత్తయితే.. వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం మరో ఎత్తు. ములుగు జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన మోడల్ కిచెన్ గార్డెన్ కార్యక్రమం(Model Kitchen Garden Program) ఇందుకు ఒక బృహత్తర ప్రయత్నంగా కనిపిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన డీఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని దే వగిరిపట్నం, జంగాలపల్లి, అబ్బాపురం, రామన్నగూడెం జెడ్పీ హైస్కూళ్లలో మోడల్ కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేయడం ఆహ్వానించదగిన పరి ణామం. ఇది కేవలం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా విద్యార్థులను ప్రకృతితో అనుసంధానం చేసే జీవన విద్యగా రూపుదిద్దుకోవాలి.
ప్రయోజనాలెన్నో..
పాఠశాల ఆవరణలో కూరగాయలు పండించడం చూస్తే చిన్న ప్రయత్నంగానే అనిపించవచ్చు. కానీ విద్యార్థులను ఆ ప్రక్రియలో భాగస్వాము లను చేస్తే దాని ప్రయోజనం విస్తృతం. విత్తనం నాటిన విద్యార్థి వెంటనే పంటను పొందలేడు. ఎదురు చూడాలి. నీరు పోయాలి. కలుపు తీయాలి. ఎండ, వర్షం నుంచి మొక్కను కాపాడాలి. అంటే ప్రకృతి అతనికి సహనాన్ని నేర్పుతుంది. శ్రమ ఫలితాన్ని చూపిస్తుంది. తాను తినే ప్రతి కూరగాయ వెనుక రైతు శ్రమ ఉందనే విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. చివరకు తాను పెంచిన పంటను ఆహారంగా తీసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియలో వ్యవసాయం, శ్రమ, సహనం, ప్రకృతి, ఆహారం, ఆరోగ్యం వంటి ఎన్నో జీవిత పాఠాలు సహజంగానే నేర్చుకుంటాడు.
ఇది తాను పుస్తకంలో చదివిన ‘కిరణజన్య సంయోగక్రియ’కు అద్దంగా కనిపిస్తుంది. మొక్కల సంఖ్యను లెక్కించేటప్పుడు గణితం బోధనకు ఉపయో గపడుతుంది. ఒక చదరపు మీటర్లో ఎన్ని మొక్కలు నాటవచ్చు? ఒక్కో మొక్కకు ఎంత నీరు అవసరం? ఒక పంట నుంచి ఎంత దిగుబడి వచ్చింది? వంటి అంశాలు విద్యార్థుల్లో లెక్కింపు, పరిశీలన, విశ్లేషణ సామర్థ్యాలను పెంచుతాయి. అందుకే పాఠశాల తోటను ‘కూరగాయల తోట’గా మాత్రమే చూడటం సరిపోదు. అది ఒక జీవ ప్రయోగశాల కావాలి.
పోషకాహారానికి పాఠశాల నుంచే పునాది
పాఠశాల తోటల మరో ముఖ్యమైన ప్రయోజనం పోషకాహారం. పాఠశాలలో పండించిన ఆకుకూరలు, కూరగాయలను సాధ్యమైన మేరకు మధ్యాహ్న భోజనంలో వినియోగించడం ద్వారా పిల్లలకు తాజా ఆహారం అందించవచ్చు. అంతకంటే ముఖ్యంగా.. కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో వారికి ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డీఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూపొందించిన ‘బడితోట పోషకాల బాట’ వంటి మార్గదర్శకాలు ఉపయోగకరంగా ఉండవచ్చు.
ఇలాంటి సమాచారాన్ని మరింత శాస్త్రీయంగా అభివృద్ధి చేసి అన్ని ప్రభు త్వ పాఠశాలలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేటి విద్యార్థి రేపటి పౌరుడు. అతని చేతిలో పుస్తకంతో పాటు ఒక విత్తనం ఉండాలి. అతని తరగతి గదిలో బ్లాక్బోర్డుతో పాటు ఒక పచ్చని తోట ఉం డాలి. అతని విద్యలో మార్కులతో పాటు మట్టితో ఉన్న అనుబంధానికీ స్థానం ఉండాలి. అప్పుడే ‘గ్రీన్ స్కూల్‌హెల్తీ స్కూల్’ అనేది ఒక నినాదంగా కాకుండా.. తెలంగాణ విద్యా వ్య వస్థలో ఒక జీవ న విధానంగా మారుతుంది. ‘ఒక పాఠశాలఒక తోట’ భావన రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన రో జున.. పాఠశాల ఆవరణలు పచ్చబడటమే కాదు, విద్యార్థుల ఆలోచనలు కూడా పచ్చబడతా యి. అదే అసలైన విద్యా విప్లవం.
సెక్రటరీ, తెలంగాణ
జర్నలిస్టుల ఫోరం. 9949839699హైదరాబాద్.
ముద్దం నరసింహస్వామి