ఐటీ శాఖలో.. అధికారి ఓవరాక్షన్!

03-10-2026 | 05:35am
  1. కంపెనీలతో భేటీలోనూ ఆయనదే పెత్తనం 
  2. ప్రసన్నం చేసుకోకపోతే మంత్రితో ములాఖత్ కష్టమే
  3. ఇప్పటికే రెండు, మూడు జీసీసీలు ఏపీకి! 
  4. గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీలకు ప్రోత్సాహాకాలూ పెండింగ్‌లోనే.. 
  5. ఏపీకి చెందిన సదరు అధికారి.. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం

అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రానికి భారీగా ఐటీ పెట్టుబడులు(IT investments) తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఐటీ శాఖలోని(IT Department) ఓ అధికారి వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంపెనీల ప్రతినిధులతో(Company representatives) జరిగే సమావేశాలు, పెట్టుబడుల ప్రతిపాదనలు, మంత్రితో భేటీల విషయంలో ఆయన జోక్యం అధికమవు తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలను కలవాలంటే ముందు గా అడ్వైజర్ స్థాయిలో సంప్రదింపులు జరపాల్సిందేనన్న భావన కంపెనీల్లో ఏర్పడుతోందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆయనను ప్రసన్నం చేసుకోకపోతే సంబంధిత మంత్రితో సమావేశం ఏర్పాటు కావడం కూడా కష్టమేననే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపె నీలు, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం తరచూ సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా జీసీసీల ఏర్పాటు, ఐటీ విస్తరణ, ఉద్యోగాల కల్పన(Job creation), గ్రామీణ ప్రాంతా లకు టెక్నాలజీ సంస్థలను తీసుకెళ్లడం వంటి అంశాలపై కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ సమావేశాల విషయంలో సదరు అధికారి జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. కంపెనీల ప్రతినిధులు ఎవరిని కలవాలి? ఎప్పుడు కలవాలి? ఏ అంశంపై చర్చించాలి? వంటి విషయాల్లోనూ ఆయన ప్రభావం ఉంటోందని సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వ విధానాలు, రాయితీలు, భూమి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై నేరుగా మంత్రితో చర్చించాల్సిన అవసరం ఉంటుంది.

అయితే ప్రస్తుతం మంత్రితో సమావేశం కావాలంటే ముందుగా ఆ అధికారిని సంప్రదించాల్సి వస్తోందనే అభిప్రాయం కొన్ని కంపెనీల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ విధానం వల్ల ప్రభుత్వంతో నేరుగా చర్చించాలనుకునే పెట్టుబడిదారులకు అసౌకర్యం కలుగుతోందనే వాదన వినిపిస్తోంది.

జీసీసీల విషయంలో..

తెలంగాణను దేశంలోని ప్రధాన జీసీసీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి. మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం పెట్టుబడి సదస్సులు, రోడ్‌షోలు, ప్రత్యేక పాలసీలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. శాఖలోని అంతర్గత వ్యవహారాలు, సమావేశాల విషయంలో జరుగుతున్న జాప్యం సంస్థలను పునరాలోచనలో పడేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే రెండు, మూడు జీసీసీలు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లినట్లు అధికార వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే ఆ అధికారి కూడా ఏపీ ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం. పెట్టుబడుల విషయంలో పోటీ రాష్ట్రాలు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఇలాంటి పరిణామాలు రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరానికే ఐటీ పరిశ్రమ పరిమితం కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

దీని కోసం ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ అందిస్తామని చెప్పడంతోపాటు ఎప్పటికప్పుడు పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలతో మంత్రి సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. కానీ అధికారి జోక్యంతో ఆయా సంస్థలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం.

యూనిట్ ఏర్పాటు చేసి, ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చిన కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు సకాలంలో అందకపోతే పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు చెల్లింపులు, కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు వర్తించే ప్రోత్సాహకాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది.

సీఎంవో అధికారుల అసంతృప్తి..

కాంట్రాక్టు పద్ధతిలో శాఖలోకి వచ్చిన సదరు అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారుల పరిధిలోనూ జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది. సాధారణంగా శాఖలో విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనా వ్యవహారాలు, పెట్టుబడుల పరిశీలన వంటి అంశాల్లో సీనియర్ అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు ఉంటాయి. అయితే ఆ అధికారి పక్కనపెట్టి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాల్సిన వ్యక్తి.. వారిని కూడా లెక్కచేయకుండా నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నారనే చర్చ శాఖలో ఉందని సమాచారం.

దీనివల్ల అధికారుల మధ్య సమన్వయానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అధికారి వ్యవహారశైలిపై సీఎంవోలోని కొందరు ఐఏఎస్ అధికారులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెట్టుబడులను ఆకర్షించే శాఖలో అధికారులు, మంత్రులు, కంపెనీల ప్రతినిధుల మధ్య సమన్వయం అత్యంత కీలకమైన సమయంలో.. ఒకే వ్యక్తి చుట్టూ నిర్ణయ ప్రక్రియ తిరుగుతున్నట్లుగా కనిపించడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

ఐటీ, జీసీసీ రంగంలో తెలంగాణకు ఇప్పటికే బలమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాలు రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇతర రాష్ట్రాలు కూడా జీసీసీలను ఆకర్షించేందుకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు సింగిల్ విండో తరహాలో వేగవంతమైన నిర్ణయాలు, అధికారులతో నేరుగా సంప్రదింపులు, ఇన్సెంటివ్‌లు సకాలంలో విడుదల, స్పష్టమైన విధానాలు అవసరం.

శాఖలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి, సమావేశాల విషయంలో జోక్యం, ప్రోత్సాహకాల పెండింగ్ వంటి అంశాలు పరిష్కారం కాకపోతే పెట్టుబడుల ఆకర్షణపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. జీసీసీలు సహా ఐటీ సంస్థలు రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చూడాలంటే పెట్టుబడిదారులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం నేరుగా సమీక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు త్వరగా పరిష్కరించడం, కంపెనీలతో సమావేశాల ప్రక్రియను పారదర్శకంగా మార్చడం, మంత్రిఅధికారులుపెట్టుబడిదారుల మధ్య నేరుగా సమన్వయం కల్పించడం వంటి చర్యలు అవసరమని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు