సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్!
- మూడు నెలలుగా శుభ్రం చేయని మరుగుదొడ్లు
- జీరా రైస్ పేరుతో తెల్ల అన్నం కంపు కొడుతున్న మరుగుదొడ్లు చెత్త వ్యర్థాలతో నిండిపోయిన పరిసరాలు
- హాస్టల్ పక్కనే మూడు నెలలుగా నిలిచిన మురుగునీరు
- వసతులు కల్పించాలని తల్లిదండ్రులు వేడుకోలు
సంస్థాన్ నారాయణపూర్, అక్టోబర్ 2: గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లలో(Residential schools and welfare hostels) అత్యున్నత ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న సర్కారు మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాస్తవికంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల(Students') పరిస్తితి అధ్వాన్నంగా మారింది. ఉన్నత అధికారుల తనిఖీలు లేకపోవడం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని గురుకుల పాఠశాల, ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులు దుర్భరస్థితిని అనుభవిస్తున్నారు.
కనీస వసతులు కరువు..
నారాయణపురం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో పారిశుధ్యం కనుమరుగైంది. 64 మంది విద్యార్థులు ఉంటున్న హాస్టల్ లో మరుగుదొడ్లు, స్నానాల గదులు తలుపులు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. మూడు నెలలుగా వాటిని శుభ్రపరచడం లేదని వాపోతున్నారు విద్యార్థులు. స్నానాలగదికి తలుపులే లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెల్లన్నమే అల్పాహారం..:
విద్యార్థులకు మెనూ ప్రకారం వడ్డించాలనేది ప్రభుత్వ నిబంధన కానీ ఇక్కడ అవేం పనిచేయవు.తెల్లన్నమే జీరా రైస్.. పరమాన్నం.. కిచిడీ.. అన్నీ..అన్నం కూడా సరిగా వండడం లేదని ఖాళీ కడుపుతో పండుకుంటున్నామని తమకు సరైన ఆహారం ఇవ్వాలంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భరోసా సరే..భద్రతేది..!
మండలంలోని సర్వేలు గురుకుల పాఠశాల,కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థులు తప్పించుకొని పారిపోయిన ఘటనలతో విద్యార్థులకు ఉన్న భద్రత పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో మూడు నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలు పారిపోవడం, సర్వేలు గురుకుల పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు గోడ దూకి పారిపోవడం తిరుపతి రైల్వే స్టేషన్లో దొరకడం కలకలం సృష్టించింది.
తమకు దూరంగా ఉన్నప్పటికీ మంచి చదువు సౌకర్యాలు ఉంటాయని హాస్టళ్లకు పంపుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులు ఆహారం తీసుకొని అస్వస్థతకు గురి కావడం మిగతా విద్యార్థులకు భయానకంగా మారింది.హాస్టల్ గేటు ఎదురుగానే నెలల తరబడి మురుగునీరు నిల్వ ఉంటుంది.దీనివల్ల విషజ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు విద్యార్థులు.
భయపడుతున్న తల్లిదండ్రులు! :
తమ పిల్లలను హాస్టళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని పంపితే పస్తులు ఉండే పరిస్తితి చూసి ఆందోళన చెందుతున్నారు.గతంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాత్రి బస పేరిట ఎస్సీ హాస్టల్ లో నెల నెల విచ్చేసి సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించినప్పటికీ ఎలాంటి మార్పులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది.ఇప్పటికైన అధికారులు తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్, పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయులపై తగు చర్యలు తీసుకొని హాస్టల్లోని విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధికారులు తనిఖీలు చేసి సౌకర్యాలు కల్పించాలి
‘హాస్టళ్లలో విద్యార్థుల దుర్భర పరిస్థితుల్లో చదువుకుంటున్నారు.కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.మూడు నెలలుగా మరుగుదొడ్లు శుభ్రపరచకపోవడం వార్డెన్ నిర్లక్ష్యానికి నిదర్శనం.మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకొని విదార్థులకు సౌకర్యాలు కల్పించాలి.
- దుబ్బాక భాస్కర్ సీపీఐ,మండల కార్యదర్శి