26 August, 2026 | 3:08 AM

ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు రూ.185 కోట్లు విడుదల

26-08-2026 12:32 AM
  1.   16వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం
  2. నిధులను సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  3. రేపు డీబీటీ ద్వారా ఒక్కో లబ్ధిదారుడి ఖాతాల్లోకి లక్ష రూపాయలు

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిధుల కొరతతో నిలిచిపోయిన నిర్మాణాలకు మళ్లీ వేగం పుంజుకునేలా ఫైనల్ బిల్లులను విడుదల చేసింది. మార్చి నెల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న దాదాపు 16,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా మొత్తం రూ.185 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు సకాలంలో రాకపోవడంతో బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. అయితే, లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో కేంద్రం నిధుల కోసం వేచి చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత నిధుల నుంచి రూ.185 కోట్లను సర్దుబాటు చేసి విడుదల చేసింది.

విడుదల చేసిన ఈ నిధులను గురువారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. చివరి విడత బకాయిల కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.1 లక్ష చొప్పున డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుంది. పెండింగ్ బిల్లులు విడుదల కావడం, అదీ కూడా ఒకేసారి లక్ష ఆర్థిక సాయం ఖాతాల్లో పడనుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.