TG-iPASSపై సైబర్ దాడి.. డేటా లాక్!
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన TG-iPASS పోర్టల్‌పై సైబర్ దాడి కలకలం రేపుతోంది. అక్టోబర్ 22 రాత్రి నుంచి పోర్టల్ పనిచేయకపోవడంతో పరిశ్రమలకు సంబంధించిన ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్‌లోని డేటాబేస్‌ను హ్యాకర్లు ఎన్‌క్రిప్ట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫైళ్లకు .vgb ఎక్స్‌టెన్షన్‌తో కొత్త పేర్లు కనిపించడంతో పాటు సర్వర్‌లో రాన్సమ్ నోట్ కూడా బయటపడింది.
ఈ ఘటన ప్రభావంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు కోరే సంస్థలు, వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రాసెసింగ్, అనుమతుల జారీ, పోర్టల్‌లోని సమాచారాన్ని పొందడం వంటి సేవల్లో జాప్యం జరగవచ్చు. అయితే, ఈ అంతరాయం వల్ల ఎంతమంది దరఖాస్తుదారులు ప్రభావితమయ్యారనే దానిపై స్పష్టమైన వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఐటీ చట్టంలోని సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేసింది. సర్వర్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు గురిచేసి సైబర్ దాడికి సంబంధించిన ఆధారాలను సేకరించనున్నారు. హ్యాకర్లు వ్యవస్థలోకి ఎలా చొరబడ్డారు? డేటాను కేవలం ఎన్‌క్రిప్ట్ చేశారా? లేక కీలక సమాచారాన్ని కాపీ చేసి బయటకు తరలించారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు, డేటా బ్యాకప్ అందుబాటులో ఉందా, దాని ద్వారా సమాచారాన్ని తిరిగి పునరుద్ధరించగలరా అనే అంశాలు కూడా కీలకంగా మారాయి. పోర్టల్ సేవలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే, డేటా చోరీ జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పోర్టల్ పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఈ ఘటన వల్ల ప్రభుత్వ సేవలపై ఎంత ప్రభావం పడిందనే విషయాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.