ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

18-09-2026 | 04:46pm

బోధన్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో (Nizamabad Police Headquarters)శుక్రవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ (Reserve Inspector H. Satish) మృతి చెందారు.

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో తన ఆయుధాన్ని క్లీన్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తుపాకీ అకస్మాత్తుగా పేలడంతో తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

సంఘటన సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు