కాలుష్య గరళం!
- సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో జలం హాలాహలం!
- విషతుల్యంగా భూగర్భ జలాలు
- వర్షం మాటున ఫ్యాక్టరీలు రసాయన జలాల విడుదల
- రివర్స్ బోరింగ్‌తో భూమి పొరల్లోకి..
- రోగాలబారిన పడుతున్న గ్రామాలు
- పటాన్‌చెరు, బొల్లారం, పాశమైలారంలో దారుణమైన పరిస్థితి
- సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు గాలికేనా?
ఒకప్పుడు పంటల సాగుకు, మంచినీటికి ఆధారమైన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు భూగర్భ జలాలు.. పారిశ్రామిక ప్రగతి పుణ్యమా అని నేడు విషపు ఊటలుగా మారాయి. పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వెరసి ఇక్కడి భూగర్భాన్ని రసాయన వ్యర్థాల నిక్షేపంగా మార్చేశాయి. ప్రాణాధారమైన నీరే, ప్రజల ప్రాణాలు తీసే మహమ్మారిలా మారింది.
సుప్రీంకోర్టు సైతం జీరో లిక్విడ్ విధానాన్ని వంద శాతం అమలు చేయాలని ఆదేశాలిచ్చినా అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన అల్లాడుతున్నారు. ఈ నీటిని గర్భిణులు తాగడం వల్ల పుట్టబోయే బిడ్డలపై ప్రభావం పడుతోంది. పుట్టుకతోనే వివిధ రకాల వైకల్యానికి గురవుతున్నారు. రసాయనిక జలాల కారణంగా గర్భంలోనే పిండాలు కరిగిపోయిన ఘటనలు ప్రజల మనుగడనే ప్రమాదంలో పడేస్తున్నాయి.
సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో భూగర్భజలాలు ఒకప్పుడు తాగితే తియ్యగా.. పంటల సాగుకు అనువైనవిగా ఉండేవి. నేడు రసాయనాల రంగులు, ఘాటైన వాసనలతో విషతుల్యంగా మారాయి. ఫార్మా, బల్క్ డ్రగ్, కెమికల్ కంపెనీల నిర్వాహకులు శుద్ధి చేయని వ్యర్థాలను యథేచ్ఛగా భూమిలోకి, స్థానిక చెరువుల్లోకి వదలడమే ఇందుకు ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షాలు పడితే రైతులు, ప్రజలు ఆనందిస్తారు.
కానీ సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, బొల్లారం, జిన్నారం, ఖాజీపల్లి, పాశమైలారం ప్రాంతాల ప్రజలకు మాత్రం వర్షం అంటేనే వణుకుపుడుతోంది. వర్షపు నీటి ప్రవాహాల మాటున కొన్ని పరిశ్రమలు తాము నిల్వ ఉంచిన రసాయన వ్యర్థాల(Chemical waste)ను దొంగచాటుగా వరద కాల్వల్లోకి, నల్లచెరువు, ఆస్మాన్పూర్ చెరువు, ఇతర జలాశయాల్లోకి వదిలేస్తున్నాయి. దీనివల్ల చెరువుల నీరు ఎర్రగా, నల్లగా మారిపోవడమే కాకుండా, ఆ రసాయనాలు భూమిలోకి ఇంకి బోరుబావుల నీటిని కూడా పూర్తిగా కాలకూట విషంగా మార్చేస్తున్నాయి. గణాంకాలు ఏం చెబుతున్నాయి?
కేంద్ర భూగర్భ జల బోర్డు, పర్యావరణ పరిశోధన సంస్థల నివేదికల ప్రకారం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కారిడార్లో నీటి నాణ్య త సూచీలు అనుమతించదగిన పరిమితులకంటే వందల రెట్లు దాటిపోయాయి. సాధా రణంగా తాగునీటిలో టీడీఎస్ 300 నుండి 500 ఎంజీ/ఎల్ ఉండాలి. కానీ పటాన్చెరు, బొల్లారం పరిసరాల్లోని బోరు బావుల్లో ఇది ఏకంగా 3,500 నుండి 6,000 ఎంజీ/ ఎల్ వరకు నమోదవుతోంది. ఈ నీరు కనీసం బట్టలు ఉతుక్కోవడానికి, స్నానాలకు కూడా పనికిరాదు.
ఇక్కడి భూగర్భ జలాల్లో కేన్స ర్కు కారణమయ్యే సీసం, కాడ్మియం, క్రోమి యం, ఆర్సెనిక్ వంటి లోహాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే 10 నుండి 15 రెట్లు ఎక్కువ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. పారిశ్రామిక రసాయనాల కా రణంగా నీటిలో కెమికల్ ఆక్సీజన్ డిమాండ్ (సీఓడీ) స్థాయి విపరీతంగా పెరిగిపోయా యి. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ పూర్తిగా నశిం చి, చెరువుల్లో చేపలు, ఇతర జలచరాలు గిలగిలా కొట్టుకుంటూ చనిపోతున్నాయి.
రివర్స్ బోరింగ్ మాఫియా..
అత్యంత ఘోరమైన విషయం ఏమిటం టే వ్యర్థాల శుద్ధికయ్యే ఖర్చు తప్పించుకోవడానికి కొన్ని కాలుష్యకారక పరిశ్రమలు ఓ కొత్త దారుణానికి తెరలేపాయి. ఫ్యాక్టరీల లోపలే రహస్యంగా ‘రివర్స్ బోర్‌వెల్స్’ వేసి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను నేరుగా భూమిలోకి పంపుతున్నట్లు తెలు స్తోంది. దీనివల్ల కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితమై, భవిష్యత్తు తరాలకు కూ డా పనికిరాకుండా పోతున్నాయి. కలుషిత జలాలు, గాల్లోకి వదులుతున్న బూడిద, ఘాటైన రసాయన వాసనల వల్ల పరిసర గ్రామాలు గడ్డపోతారం, నందికంది, కిష్టాయిపల్లి, దోమడుగు, ఇస్నాపూర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఎక్కడ?
గతంలో పటాన్‌చెరు కాలుష్యంపై సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ చారిత్రా త్మక తీర్పులు ఇచ్చాయి. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై కోట్ల రూపాయల జరిమానా విధించడమే కాకుండా, ఒక్క చుక్క రసాయన నీటిని కూడా బయటకు వదలకుండా ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానాన్ని వంద శాతం అమలు చేయాలని ఆదేశించాయి. కానీ, నేటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఆ నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.
బోరు వేస్తే యాసిడ్ లాంటి నీరు వస్తోందని, గ్రామాల్లో ఏ బోరు వేసినా నీళ్లు ఎర్రగా, కెమికల్ వాసనతో వస్తున్నాయని చె బుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, అవి చాలక రోజుకు 40 రూపాయలు పెట్టి తాగునీరు కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పరిశ్రమల లాభాల కోసం మమ్మల్ని ఇలా ఎంతకాలం బలితీసుకుంటారని ప్రారిశ్రామిక ప్రాంత నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.