పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
కొత్తపల్లి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో మొక్కజొన్న, వరి మరియు పత్తి పంటలను మొక్కజొన్న ప్రాంతీయ పరిశోధనా కేంద్రం (ఎఆర్ సి), హైదరాబాద్, వ్యవసాయ పరిశోధనా స్థానం (ఎ ఆర్ ఎస్), కరీంనగర్ మరియు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(Telangana Farmers' Knowledge Centre), కరీంనగర్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశీలించారు. ఈ క్షేత్ర సందర్శనలో మొక్కజొన్న పంటలో ఫ్యూజేరియం విల్ట్ తెగులు లక్షణాలను, వరి పంటలో కాండం తొలుచు పురుగు ఉధృతిని, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల సముదాయంను గమనించడం జరిగింది.
అనంతరం రైతులకు శాస్త్రవేత్తలు నివారణ సూచనలు తెలుపుతూ మొక్కజొన్న పంటకు ఫ్యూజేరియం విల్ట్ నివారణకు కరీంనగర్ మక్క-1 వంటి విల్ట్ తెగులు తట్టుకునే సంకర విత్తనాలను వినియోగం, సమగ్ర మరియు సిఫారసు చేసిన సస్యరక్షణ చర్యలు పాటించడం, పంట మార్పిడి, సమతుల్య ఎరువుల వినియోగం, పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూడటం మరియు వ్యాధి సోకిన మొక్కలను తొలగించవలెనని,
వరి పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు పొలం పరిశుభ్రత, సిఫారసు చేసిన పురుగు మందుల వినియోగం, పురుగు ఉధృతి ఆధారంగా నియంత్రణ చర్యలు చేపట్టాలని,పత్తిలో పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు పొలాన్ని క్రమం తప్పకుండా పరిశీలించడం, మిత్ర పురుగులను సంరక్షించడం, అవసరమైనప్పుడు మాత్రమే సిఫారసు చేసిన పురుగు మందులను వినియోగించాలని తెలియజేశారు.