యుద్ధంలో కుక్క సంచలనం!

02-10-2026 | 01:00pm

కుక్క కాదు.. యుద్ధ వీరుడు!

వీధి కుక్క.. సైనికుల మధ్యకు వచ్చింది. యుద్ధ నౌకలో రహస్యంగా ప్రయాణించింది. తుపాకుల మోత మధ్య సైనికులతో కలిసి కందకాల్లో గడిపింది. చివరకు సైనికుల ప్రాణాలను కాపాడిన యుద్ధ వీరుడిగా చరిత్రలో నిలిచింది. ఇదే ‘సార్జెంట్ స్టబ్బీ’(Sergeant Stubby) కథ. 1917లో అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో సైనిక శిక్షణ జరుగుతున్న సమయంలో స్టబ్బీ అనే వీధి కుక్క(Sergeant Stubby Dog) అక్కడి సైనికుల వద్దకు చేరింది. సైనికుడు జే. రాబర్ట్ కాన్రాయ్‌తో స్టబ్బీకి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. దాని పొట్టిగా ఉన్న తోకను చూసి అతడు దానికి ‘స్టబ్బీ’ అనే పేరు పెట్టాడు. కానీ ఆ చిన్న కుక్క అక్కడితో ఆగిపోలేదు. సైనికులపై ఏర్పడిన అనుబంధంతో వారిని విడిచిపెట్టేందుకు సిద్ధపడలేదు. అమెరికా సైనిక బృందం ఫ్రాన్స్‌కు బయలుదేరినప్పుడు కాన్రాయ్ దాన్ని యుద్ధ నౌకలో రహస్యంగా తీసుకెళ్లాడు. అలా స్టబ్బీ యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది.

యుద్ధరంగంలో అసలు సాహసం..

ఫ్రాన్స్‌లో అమెరికా 102వ పదాతిదళ రెజిమెంట్‌తో కలిసి సుమారు 18 నెలల పాటు స్టబ్బీ సేవలందించింది. ఈ సమయంలో 17 యుద్ధాలు, నాలుగు ప్రధాన దాడుల్లో పాల్గొన్నట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. ఒకసారి స్టబ్బీ స్వయంగా మస్టర్డ్ గ్యాస్‌కు గురైంది. ఆ అనుభవం తర్వాత విషవాయువు వాసనను గుర్తించే సామర్థ్యం దానికి ఏర్పడింది. గ్యాస్ దాడి జరగబోతోందని గుర్తించిన ప్రతిసారి కందకాల మధ్య పరుగులు తీస్తూ మొరుగుతూ సైనికులను అప్రమత్తం చేసేది. యుద్ధం అంటే కేవలం శత్రువుతో పోరాటమే కాదు.. గాయపడిన వారిని కాపాడటం కూడా. ఈ విషయంలోనూ స్టబ్బీ సైనికులకు సహాయకురాలిగా మారింది. యుద్ధభూమిలో గాయాలతో పడిపోయిన సైనికులను గుర్తించి వారి దగ్గరకు వైద్య సిబ్బంది చేరేలా చేసేది. ఒక సందర్భంలో జర్మన్ గూఢచారిని గుర్తించడంలో కూడా స్టబ్బీ కీలకంగా వ్యవహరించినట్లు చరిత్రలో నమోదైంది. సైనికులు అక్కడికి చేరుకునే వరకు అతడిని కదలకుండా అడ్డుకున్నట్లు కథనాలు పేర్కొంటాయి.

‘సార్జెంట్’గా మారిన స్టబ్బీ..

స్టబ్బీకి అధికారిక సైనిక హోదా ఇవ్వబడినట్లు కాకపోయినా, దాని సాహసాలకు గుర్తింపుగా ‘సార్జెంట్’ అనే అనధికారిక బిరుదు ప్రాచుర్యంలోకి వచ్చింది. యుద్ధ(World War I Hero Dog) సమయంలో గాయపడినప్పటికీ తిరిగి సైనికులతో కలిసి సేవలు కొనసాగించింది. దాని సేవలకు గుర్తింపుగా పలు పతకాలు, పురస్కారాలు లభించాయి. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకు తిరిగి వచ్చిన స్టబ్బీ సాధారణ వీధి కుక్కగా కాకుండా ఓ సెలబ్రిటీగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షులతో సమావేశమయ్యే అవకాశం కూడా దక్కింది.

చరిత్రలో నిలిచిపోయిన స్టబ్బీ..

1926లో స్టబ్బీ మరణించింది. అయితే దాని కథ అక్కడితో ముగియలేదు. స్టబ్బీ భౌతికకాయాన్ని సంరక్షించి అమెరికాలోని స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచారు. సార్జెంట్ స్టబ్బీ కథ.. ఒక జంతువు కూడా అసాధారణ పరిస్థితుల్లో మనుషులకు ఎంతటి సహాయం చేయగలదో గుర్తుచేసే చారిత్రక ఘటనగా నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు