ప్రీ ప్రైమరీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
కల్వకుర్తి సెప్టెంబర్ 24: చిన్నారుల విద్యాభ్యాసంలో ప్రీ ప్రైమరీ దశ ఎంతో కీలకమని, ఈ దశ నుంచే విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేలా బోధనా కార్యక్రమాలు నిర్వహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemanth Keshav Patil) సూచించారు. గురువారం అచ్చంపేట సబ్‌కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి వంగూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రీ ప్రైమరీ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు అందిస్తున్న బోధనా విధానం, హాజరు, మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రీ ప్రైమరీ దశలోనే విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, సంఖ్యా జ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు పెంపొందేలా బోధన సాగించాలని సూచించారు. ఆటలు, కథలు, పాటలు, చిత్రాలు, వివిధ విద్యా కార్యకలాపాల ద్వారా చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని తెలిపారు. అనంతరం కొండారెడ్డిపల్లి లో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.
వచ్చే నెల ఐదో తారీకు వరకు ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రావాలని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, ఈడబ్ల్యూడీసీ ఈఈ రామచందర్, ఇంజనీరింగ్ అధికారులు, వంగూరు తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీడీవో శారద, మండల విద్యాధికారి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.