ఎర్ర సత్యం స్ఫూర్తితో రాజ్యాధికారం
బీసీల కడుపు కొడుతున్న పాలనకు ‘కత్తెర’తోనే సమాధానం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అన్యాయాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం పోరాట స్ఫూ ర్తితో బీసీలను రాజకీయంగా ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్ర 15వ రోజు నారాయణపేట జిల్లా మరికల్ చేరుకుంది. కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న ప్రసంగిస్తూ.. ‘ఎర్ర సత్యాన్ని హత్య చేశారు. కానీ ఆయన పోరాట స్ఫూర్తిని హత్య చేయలేకపోయారు.
అణగారిన వర్గాల తరఫున నిలబడి రాజకీయంగా ఎదిగిన ఎర్ర సత్యం 1994లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, 1996 ఆగస్టు 11న హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఆయనను భౌతికంగా లేకుండా చేయగలిగారు కానీ ఆయన పోరాట స్ఫూర్తిని మాత్రం లేకుండా చేయలేకపోయారు. ఈ రోజు అదే ఎర్ర సత్యం పోరాట స్ఫూర్తిని మరికల్ చౌరస్తాకు తీసుకొచ్చాం” అని మల్లన్న అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత తమ ఆత్మగౌరవానికి ప్రతీకలైన ఎర్ర సత్యం, రాములన్న, పండుగల సాయన్న వంటి పోరాట యోధుల చరిత్రకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.
బీసీలు తమ జనాభా బలాన్ని రాజకీయ బలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలు ఇతరుల జెండాలు మోయడం మానేసి తమ రాజకీయ నాయకత్వాన్ని తామే నిర్మించుకోవాలని అన్నారు. బీసీలకు వివిధ పథకాల కింద రూ.11,500 కోట్ల మేర కేటాయింపులు ఉండగా రూ.2,426 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షలకు బీసీ యువతను సిద్ధం చేసే స్టడీ సర్కిళ్లకు రూ.50 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.4 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు.
అలాగే బీసీ కార్పొరేషన్లకు రూ.4,102 కోట్ల కేటాయింపులకు గాను రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని; చేనేత కార్మికులకు రూ.450 కోట్ల కేటాయింపుల్లో రూ.350 కోట్లు, గీత కార్మికులకు రూ.70 కోట్లలో రూ.18 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే బీసీలు రాజకీయంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్షులు మాదివాల కృష, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జయపాల్ రెడ్డి, యూత్ అధ్యక్షులు కొమ్మూరు రమేష్, మహిళ కార్యదర్శి బత్తిని మీన, పార్టీ నాయకురాలు పూజిత పాల్గొన్నారు.