మా తెల్ల కాగితం అలాంటి తల్లిదండ్రులకు అంకితం
హర్ష్ రోషన్(Harsh Roshan), నక్షత్ర(Nakshatra) జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘తెల్లకాగితం(Tella Kagitham)’. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందించారు. కే శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను, రామ్ జగదీశ్, నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో హర్ష రోషన్ మాట్లాడుతూ.. “ఈ వారం రోజుల్లో నేను రెండు షాక్‌లు చూశాను. మొదటిది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మా ట్రైలర్ గురించి పోస్ట్ చేసి మాకు కొండంత ధైర్యం ఇవ్వడం, రెండోది సినిమా విడుదలకు మూడు రోజుల ముందు మా చిత్రం నుంచి ఒక వీడియో లీక్ కావడం. ఆ లీక్ అయిన వీడియోపై వచ్చిన ప్రతి మీమ్, ట్వీట్, రీల్ చూశాను.
అందులో అందరూ ‘తప్పు తప్పు’ అని విమర్శిస్తున్నారు. టీజర్, ట్రైలర్లలో కూడా మేము అదే విషయాన్ని తప్పు అనే చూపించాం. నా దగ్గరికి రొటీన్ కమర్షియల్, ఫైట్ల కథలు ఎన్నో వచ్చినా, ఒక నటుడిగా సమాజానికి ఒక ఎమోషన్, మంచి కథను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. లీక్ వీడియో క్లిప్ చూసి తప్పుగా భావిస్తున్నవారి ఆలోచనా విధానం, సినిమా చూసిన తర్వాత పూర్తిగా మారిపోతుందని ఒట్టేసి చెప్తున్నా” అన్నారు.
హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. “తెల్ల కాగితం’ మూవీ 2006 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ అయినా.. ప్రస్తుత జనరేషన్‌తోపాటు రాబోయే తరాలకు కూడా అర్థమయ్యే ఒక అందమైన సందేశం ఇందులో ఉంది. ఈ సినిమాను కుటుంబమంతా కలిసి చూడవచ్చు. ఇందులో ఎన్నో మంచి విషయాలు, నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి. ఈ సినిమాలో నాకు ‘ఆశ’ అనే చక్కటి పాత్రను ఇచ్చిన మేకర్స్‌కు కృతజ్ఞతలు. ఇది నా డెబ్యూ మూవీ కావడంతో ప్రారంభంలో సెట్లో చాలా టెన్షన్ పడ్డాను. కానీ హీరో రోషన్, శ్రావ్య, దీపక్ అంతా ఒక చిన్న కుటుంబంలా కలిసిపోయి రోజుకో కొత్త విషయం నేర్పిస్తూ నన్ను ఎంతో ప్రోత్సహించారు.
ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి మా టీమ్‌ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా” అని చెప్పింది. డైరెక్టర్ రమేశ్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. “రెండు రోజులుగా నా సినిమా గురించి ఓ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అలాంటిది ఏమి లేదు. ఆ ఒక్క కంటెంట్‌తో నందుని, రోషన్‌ను బ్యాడ్ చేస్తున్నారు. మా అమ్మకి కూడా ఫోన్ చేసి నీ కొడుకు ఇలాంటి సినిమా తీశాడేంటి అని అన్నారట. కానీ నేను నా కుటుంబం, స్నేహితులు గర్వపడేలాంటి సినిమానే తీశాను. ట్రోల్ చేసినవారంతా సినిమా చూసి మాట్లాడండి” అన్నారు.
రైటర్ నందు సవిరిగాన మాట్లాడుతూ.. “ఒక కూతురి చదువు కోసం రోజుకు 12 గంటలు శ్రమించే తండ్రులు, తెల్లవారుజామునే లేచి కష్టపడే తల్లులు, తమ్ముళ్ల కోసం త్యాగం చేసే అన్నలు, వదినలే ఇలాంటి నిజమైన హీరోల ఆశీర్వాదం మా సినిమా మీద ఉన్నాయి. నిస్వార్థంగా పిల్లల కోసం బతికే అలాంటి తల్లిదండ్రులందరికీ ఈ సినిమా అంకితం. ‘తెల్ల కాగితం’ కేవలం ఒక నిబ్బా-నిబ్బీ లవ్‌స్టోరీ కాదు, అంతకంటే ఎంతో లోతైన కథ. అక్టోబర్ 2న థియేటర్లలో చూసి ప్రేక్షకులే మాట్లాడాలి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు రఘురామ్, శ్రావ్య, దీపక్, పాటల రచయితలు సురేశ్ బానిశెట్టి, పూర్ణాచారి, రచయిత సంతోష్‌తోపాటు అతిథులు కూడా మాట్లాడారు.