నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
- జిల్లా వ్యాప్తంగా 3వేలకు పైగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన
– వాటన్నింటికీ జియో ట్యాగింగ్
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి, నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) నిర్వాహకులకు సూచించారు. మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముందస్తు భద్రతా చర్యలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో మొత్తం 3వేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారని, పటిష్ట పర్యవేక్షణ కోసం ప్రతీ విగ్రహాన్ని జియో ట్యాగింగ్ చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచామని తెలిపారు. ఊరేగింపు సమయంలో వాహనాలపై ఎత్తైన విఘ్నేశ్వరుని విగ్రహాలను తరలించేటప్పుడు విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని కుంటలు, చెరువుల వద్ద ఈత రానివారు నీటిలోకి దిగవద్దని, ప్రమాదాల బారిన పడవద్దని హెచ్చరించారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలను కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. ప్రజలు, మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీ కోరారు.