ఉట్నూర్ పరిసరాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్..
* 8 నెలలుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు
*3 తులల బంగారం, 47 తులాల వెండి, రూ.30 వేల నగదు చోరీ..
*ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగలు, కాపర్ కాయిల్స్, సోలార్ పరికరాలు కూడా చోరీ..
*దొంగసొత్తు కొనుగోలు, విక్రయాలకు సహకరించిన వారిపైనా కేసులు: ఉట్నూర్ ASP రుత్విక్ సాయి కొట్టే...
ఉట్నూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఉట్నూర్ పోలీస్ స్టేషన్(Utnoor Police Station) పరిధిలో గత ఎనిమిది నెలలుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మోనూ, షాజిద్ అనే ఇద్దరు నిందితులను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి 3 తులల బంగారం, 47 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరించినట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు.
ఈ దొంగలు ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగలు, కాపర్ కాయిల్స్, సోలార్ బ్యాటరీలు, పంట పొలాల్లోని సోలార్ పరికరాలను దొంగతనానికి పాల్పడుతున్నారని అన్నారు. వీరిద్దరూ మొత్తం ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన సామగ్రిని షమ్షూ, మొబీన్, హతిక్ సహాయంతో స్క్రాప్ దుకాణాలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసిన ప్రభాకర్, చందన్, నారోజి విజయ్ తదితర బంగారు దుకాణాల నిర్వాహకులతో పాటు వారికి సహకరించిన మోహన్, జయవంత్, శివరాత్రి శ్రీనివాస్ తదితరులపై కూడా కేసులు నమోదు చేశారు. దొంగతనాలకు పాల్పడేవారితో పాటు దొంగసొత్తును కొనుగోలు చేసే, విక్రయించే వారికి కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రుత్విక్ సాయి కొట్టే హెచ్చరించారు. ఏఎస్పీతోపాటు ఉట్నూర్ సీఐ మాడవి ప్రసాద్, ఎస్సై విజయ్లు పాల్గొన్నారు.