బండ్రవల్లి వద్ద 7 ఇసుక టిప్పర్లు పట్టివేత
బండ్రవల్లి వద్ద అక్రమ ఇసుక రవాణా కలకలం
7 టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించిన రైతులు, బిఆర్ఎస్ నాయకులు
చిన్నచింతకుంట: మండల కేంద్ర పరిధిలోని బండ్రవల్లి గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగు నుంచి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఏడు(7) టిప్పర్ల(Tipper)ను బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాములు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు,స్థానిక రైతులు కలిసి పట్టుకున్నారు. అనంతరం వాటిని స్థానిక పోలీస్ స్టేషన్(Police station)కు తరలించి అధికారులకు అప్పగించారు...స్థానికులు ఇలా చెబుతున్నారు.గత కొంతకాలంగా ఈ మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీంతో స్థానిక రోడ్లు పూర్తిగా ధ్వంసమవడమే కాకుండా, గ్రామస్తులు, రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో బండ్లపల్లి గ్రామ సమీపంలో వరుసగా వెళ్తున్న టిప్పర్లను గమనించిన రైతులు,వెంటనే బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాములుకు సమాచారం అందించారు. రైతుల సమాచారంతో స్పందించిన కోట రాములు, పార్టీ శ్రేణులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఏడు టిప్పర్లను అడ్డుకున్నారు.వాహనదారుల వద్ద ఎలాంటి రవాణా అనుమతి పత్రాలు లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ వాహనాలను పోలీసులకు అప్పగించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోట రాములు మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు పాల్పడుతూ సహజ వనరులను దోచుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమార్కులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిఘా పెంచాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. పట్టించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.