ఒక్క సలహా.. యువకుడి ఆరోగ్యం పూర్తిగా విషమం!
హైదరాబాద్: ‘వీఆర్కే డైట్’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పరిచయమైన వీరమాచనేని రామకృష్ణపై(Veeramachineni Ramakrishna) సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనకు ఇచ్చిన వైద్య సలహా కారణంగానే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందంటూ నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయి.
నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కల్లెడ సాయికృష్ణ టైప్-1 డయాబెటిస్తో(Diabetes Diet) బాధపడుతున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వీరమాచనేని రామకృష్ణకు సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత తన ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించి హైదరాబాద్ షేక్‌పేటలోని వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్‌ను(VRK Health Care Center) సంప్రదించినట్లు తెలిపారు. అక్కడ వీరమాచనేని రామకృష్ణతో పాటు ఆయన సహాయకుడు కోటేశ్వరరావు తనకు కొన్ని సూచనలు చేశారని సాయికృష్ణ ఆరోపించారు. ముఖ్యంగా ఇన్సులిన్ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సలహాల కోసం మొత్తం రూ.26 వేల ఫీజు చెల్లించినట్లు తెలిపారు.
అయితే ఆ సూచనలు పాటించిన కొద్ది రోజులకే తన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని సాయికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ (DKA), తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ పరిణామం తర్వాత తనకు ఇచ్చిన సలహాలపై అనుమానం వ్యక్తం చేసిన సాయికృష్ణ.. వీరమాచనేని రామకృష్ణ, కోటేశ్వరరావుపై రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, నేరపూరిత కుట్ర తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.