వనపర్తిలో మేఘా మార్క్!

02-10-2026 | 05:10am
  1. సీఎంఆర్‌ఎఫ్ సాయంలో రాష్ట్రంలోనే రెండో స్థానం  
  2. 34 నెలల్లో 7,872 మందికి రూ.19.98 కోట్ల ఆర్థికసాయం  
  3. ఎల్‌ఓసీ ద్వారా మరో 469 మందికి రూ.9.18 కోట్ల సహాయం  

వనపర్తి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): పేదల వైద్యానికి భరోసా కల్పించడంలో వనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అత్యధిక సంఖ్యలో అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Tudi Megha Reddy) తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఈ స్థానం సాధించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం, పార్టీ నాయకులు వెల్లడించారు. గత 34 నెలల్లో 7,872 మంది లబ్ధిదారులకు రూ.19.98 కోట్ల మేర సీఎంఆర్‌ఎఫ్ సాయం అందింది. 

పేదల వైద్యానికి ‘మేఘా’ భరోసా 

అనారోగ్యంతో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి సహాయం అందే వరకు ప్రతి దశలో లబ్ధిదారులకు సహకారం అందేలా వనపర్తి, హైదరాబాద్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. 

ఎల్‌ఓసీ ద్వారా రూ.9.18 కోట్ల సాయం 

సీఎంఆర్‌ఎఫ్తో పాటు అత్యవసర, ఖరీదైన వైద్యం అవసరమైన వారికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా కూడా ఆర్థిక సాయ ం అందిస్తున్నారు. ఇప్పటివరకు 469 మం దికి రూ.9.18 కోట్ల ఎల్‌ఓసీ సాయం అందినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

ప్రతి నెల వేలాది దరఖాస్తులపై దృష్టి 

ప్రతి నెల సుమారు 1,200 నుంచి 1,500 వరకు సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్య అవసరాలకు సంబంధించి నెలకు సుమారు 15 నుంచి 20 ఎల్‌ఓసీ కేసుల పరిష్కారానికి సహకరిస్తున్నారు. అవసరమైన పత్రాల సమీకరణ, దరఖాస్తు ప్రక్రియ, అధికారులతో సమన్వయం వంటి అంశాలను ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 

పార్టీలకతీతంగా.. అర్హులందరికీ..

ఆపదలో ఉన్న అర్హులైన కుటుంబాలకు పార్టీలకతీతంగా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వ పథకాల ద్వారా అందే వైద్య సహాయాన్ని సకాలంలో లబ్ధిదారులకు చేరవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపింది. రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించడంలో వనపర్తికి రెండో స్థానం రావడం.. పేదల వైద్య సహాయంపై ఎమ్మెల్యే మేఘారెడ్డి కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నా బాధ్యత..

అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్యం భారం కాకూడదు. డబ్బుల కొరతతో ఏ ఒక్కరూ మెరుగైన వైద్యానికి దూరం కావద్దన్నదే నా లక్ష్యం. అర్హులైన ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్ ఎఫ్ ), లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి ) ద్వారా ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్ వరకు తిరిగి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రెండు ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి సహాయం అందే వరకు ప్రతి దశను పర్యవేక్షిస్తున్నాం. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత.

 తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే 


మరిన్ని వార్తలు