ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ నవంబర్ 25 (విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలో కందూర్ పోతన్నకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Ramarao Patel) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో ముధోల్ నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో ఇళ్లు మంజూరు కాకపోవడంతో అనేకమంది పేదలు సొంతింటి కలకు దూరమయ్యారని పేర్కొన్నారు.
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం వెయ్యి ఇళ్లే కేటాయించిందని విమర్శించారు. దీంతో అర్హులైన పేదలందరికీ న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అదనంగా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గానికి మరిన్ని ఇళ్లు సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కుభీర్ మండలం దార్ కుభీర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.