కవితకు... ఆ మంత్రి క్షమాపణలు
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ మంత్రి సీతక్క బహిరంగంగా క్షమాపణలు (Apology) చెప్పారు. కవితను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో అనుకోకుండా ఓ పదం దొర్లిందని, తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కావాలని తాను ఆ మాట అనలేదని, వెంటనే వెనక్కి తీసుకున్నానని వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం వీడియో (Video) విడుదల చేసి క్షమాపణలు వెల్లడించారు.
ములుగులో సోమవారం నిర్వహించిన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈ వివాదం (Controversy) మొదలైంది. ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు సైతం ప్రభుత్వం పింఛన్లు అందిస్తున్న అంశాన్ని ప్రస్తావించిన సీతక్క.. అనంతరం మీడియాతో మాట్లాడే సమయంలో కవిత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ పదం దొర్లడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై స్పందించిన సీతక్క.. కవితను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కవిత తనను క్యాన్సర్ పేషెంట్‌గా బీఆర్ఎస్ చిత్రీకరించిందంటూ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించే సందర్భంలో ఈ పొరపాటు జరిగిందని వివరించారు. తన మాటలకు చింతిస్తున్నానని, కవితకు క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.
అయితే, తాను వెంటనే ఆ పదాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ కొందరు రాజకీయ కక్షతో ఆ వ్యాఖ్యలను వైరల్ చేస్తూ ట్రోలింగ్ (Trolling) చేస్తున్నారని సీతక్క అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటనలో చేయూత పెన్షన్లపై కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టినందుకే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన విధానం కాదని సీతక్క స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుపై క్షమాపణలు చెబుతూనే, తన వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించారు.