మత్తులో స్టీరింగ్..ప్రాణాలతో చెలగాటం!

11-10-2026 | 12:39pm

పెద్దపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): మద్యం మత్తులో (Drunk Driving) వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఒక లారీని మరొక లారీ ఢీకొనేలా ప్రమాదకరంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. కోర్టు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

కాగజ్‌నగర్‌ వైపు వెళ్తున్న రెండు లారీలు పెద్దపల్లి పట్టణానికి చేరుకోగానే కోర్టు సమీపంలో ఓ లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా యూటర్న్‌ (U-turn) తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ల తీరును గమనించిన ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని రెండు లారీలను నిలిపివేశారు. అనంతరం డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించగా వారు మద్యం సేవించినట్లు గుర్తించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు (Strict Action) తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలను (Road Safety Rules) తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు