మట్టి తరలింపు పనుల్లో విషాదం

13-10-2026 | 02:46pm

ట్రాక్టర్‌ టైరు కిందపడి వ్యక్తి మృతి

పాపన్నపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ టైరు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల సాయిలు (44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో సోమవారం తన స్నేహితుడైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇస్మాయిల్‌తో కలిసి ఎంకెపల్లి గ్రామానికి గ్రామంలో నూతన గృహ నిర్మాణం కోసం పాత ఇంటి మట్టిని తరలించే పనిలో వెళ్లినట్లు తెలిపారు. కాగా మట్టి తరలింపు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సాయిలు ట్రాక్టర్‌పై నుంచి కిందపడగా, ట్రాక్టర్‌ టైరు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇస్మాయిల్‌ ఈ విషయాన్ని గమనించకుండానే ట్రాక్టర్ తోలుతూ మట్టి తరలింపు పనిని కొనసాగిస్తూ పని ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో స్థానికులు అతడిని నిలదీయగా, తనకు ప్రమాదం జరిగిన విషయం తెలియదని చెప్పడం డ్రైవర్ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే ఈ ఘటనపై కూటింబికులకు సమాచారం అందించగా మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మృతుడు సాయిలుకు భార్య పోచమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు