చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలి..
- పెద్దపల్లి జిల్లా డీవైఎస్ఓ అక్కపాక సురేష్
- కళాశాల ప్రిన్సిపల్ మాధవీలత
సుల్తానాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని పెద్దపల్లి జిల్లా డీవైఎస్ఓ అక్కపాక సురేష్(Peddapalli District DYSO Akkapaka Suresh), ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవీలత సూచించారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీల సందర్భంగా వారు మాట్లాడారు.జోన్ పరిధిలోని నాలుగు మండలాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని వివిధ అథ్లెటిక్స్ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు.
విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ అక్కపాక సురేష్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
చదువుతోపాటు ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించాలని సూచించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వంతోపాటు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.అనంతరం వివిధ అథ్లెటిక్స్ విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులకు డీవైఎస్ఓ అక్కపాక సురేష్, ప్రిన్సిపల్ మాధవీలత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ జోనల్ కన్వీనర్ దాసరి రమేష్, మండల కన్వీనర్ తాండ్ర ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.