ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి
* షాబాద్లో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం
* ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
షాబాద్,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలు, సాంస్కృతిక, సామాజిక తదితర అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య(MLA Kale Yadaiah), రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి సూచించారు. షాబాద్ మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 11 మంది, జిల్లా స్థాయిలో ఎంపికైన 5 మంది ఉపాధ్యాయులను శనివారం వారు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాబాద్ మండలం(Shabad Mandal) నుంచి 11 మంది మండల స్థాయి, 5 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం మండలానికి ఎంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరెందరో ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్. తాళ్లపల్లి, కేజీబివి షాబాద్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులను, హాజరైన వారిని విశేషంగా అలరించాయి. విద్యార్థుల ప్రతిభను పలువురు అభినందించారు. అనంతరం
మండల స్థాయి లో 11 మంది ఉపాధ్యాయులు బడుగుల రమాదేవి, ఎల్. భ్రమరాంబ దేవి, కె. అనురాధ, ఎం. బాలకృష్ణ, ఎన్. ఉమాదేవి, డి. షరీఫా, బషీర్ జహాన్, ఎన్. సమత, కె. రమేశ్వరి, సిహెచ్. శ్రీలక్ష్మి, ఏ. గోవర్ధన్ తో పాటు గా జిల్లా స్థాయి లో 5 మంది ఎల్. అంబర్ సింగ్, ఏ. లలిత, ఎం. సుజాత, బి. మాధవ రెడ్డి, బి. కృష్ణయ్య ఉపాధ్యాయులు సన్మానం పొందారు.కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, షాబాద్ సర్పంచ్ అశోక్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.