చలో జన్వాడ

20-09-2026 | 05:25am
  1. ఫిరంగి నాలా ఆక్రమణ.. కేటీఆర్ బాగోతాన్ని బయటపెడతాం
  2.    111 జీవోలో అక్రమ నిర్మాణం 
  3. ఆ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి 
  4. ఫామ్‌హౌస్ అసలు యజమాని ఎవరో తేలాలి
  5. ఎంపీలు మల్లు రవి, చామల, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

రంగారెడ్డి/మణికొండ, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) నార్సింగి మున్సిపాలిటీ(Narsingi Municipality) పరిధిలోని వివాదాస్పద జన్వాడ ఫామ్‌హౌస్(Janwada Farmhouse) కేటీఆర్(KTR) అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకుండా, జీవో 111 నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫిరంగి నాలాను ఆక్రమించి ఈ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని, ఈ అంశంపైనే జూలై నెలలో హైడ్రా నోటీసులు జారీచేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు.

శనివారం ప్రజాభవన్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు రాజేంద్రరెడ్డి, నవీన్ యాదవ్  తదితరులు ప్రత్యేక బస్సులో జన్వాడ ఫామ్‌హౌస్‌ను పరిశీలించేందుకు బయలుదేరింది. అయితే, ఫామ్‌హౌస్ వద్ద ‘నో ట్రెస్పాస్‘ (అనుమతి లేనిదే ప్రవేశం లేదు) బోర్డు ఉండటంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నేతలు లోపలికి వెళ్లకుండానే, వెలుపల ఉన్న ఫిరంగి నాలాతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి వెనుదిరిగారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జన్వాడ ఫామ్‌హౌస్ భూముల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ భూములన్నీ సత్యం కంపెనీ భూములు అని, సత్యం రామలింగరాజుకు చెందిన శతబిష కంపెనీ భూముల్లోనే ఈ ఫామ్‌హౌస్ నిర్మించారన్నారు. ప్రజలను మోసం చేసిన కేసులో ఈడీ ఈ కంపెనీ ఆస్తులు, షేర్లను అటాచ్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టిందని చెప్పారు. మొత్తం 13 ఎకరాల భూమి మార్పులు చేర్పులపై అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

కేసు ఐటీ ట్రిబ్యునల్ కోర్టులో ఉండగా, జన్వాడలోని సర్వే నంబర్లు 301, 311, 313లోని 13 ఎకరాల భూమిని మాత్రం 2014--15లో అనూహ్యంగా రిలీజ్ చేశారని తెలిపారు. ఆ భూమి నేరుగా ప్రముఖుల పేర్ల మీదకి రాకుండా ముందుగా ‘డీఎన్బీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్’ కంపెనీకి, ఆ తర్వాత సత్యం రామలింగరాజు కుమారుడి సన్నిహితుడైన డీ  రాజేశ్‌కు, అతని నుంచి ప్రదీప్ రెడ్డికి బదిలీ అయిందని వివరించారు. ప్రదీప్ రెడ్డి ఈ భూమిని కేటీఆర్‌కు లీజ్ ఇచ్చానని చెబుతున్నప్పటికీ, వారి మధ్య ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేదని ఆరోపించారు. 

భాజపా కేంద్ర నాయకత్వానికి సవాల్

ఈడీ అటాచ్ చేసిన కంపెనీకి చెందిన భూముల్లో ఈ 13 ఎకరాలు మాత్రమే ఎలా విడుదల అయ్యాయో, దానిపై ఐటీ శాఖ కోర్టుల్లో ఎందుకు సవాలు చేయలేదో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని చామల డిమాండ్ చేశారు. నిన్న హరీష్ రావు ఇరిగేషన్ భూముల ఆక్రమణను, నేడు కేటీఆర్ ఫాంహౌస్ బాగోతాన్ని ప్రజల ముందుంచామని, భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలను బయటపెడతామని హెచ్చరించారు. ఈ ఫామ్‌హౌస్ వ్యవహారంపై మున్సిపల్, హైడ్రా కమిషనర్లతో మాట్లాడతామని, గతంలో ఇదే ఫామ్‌హౌస్‌పై డ్రోన్ కెమెరా ఎగరేసినందుకు రేవంత్‌రెడ్డిని జైలుకు పంపారని గుర్తుచేశారు. 

నాలాపై అనుమతుల్లేకుండా.. మల్లు రవి

నాలాపై ఈ ఫామ్‌హౌస్ నిర్మాణాన్ని అనుమతులు లేకుండా ఎలా చేపట్టారని ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రశ్నించారు. ఈ నిర్మాణం వెనుక ఉన్న పూర్తి వివరాలు, అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 111 జీవో పరిధిలోని భూముల్లో నిర్మాణాలకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌస్ భూములు, నిర్మాణాలకు సంబంధించిన నిజానిజాలను తక్షణమే ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. జన్వాడ ఫామ్‌హౌస్ అసలు యజమాని ఎవరో వెంటనే తేల్చాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

ఈ ఫామ్‌హౌస్ వ్యవహారం వెనుక భారీ ఎత్తున ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేటాయింపులు, కొనుగోళ్ల వెనుక దాదాపు రూ. 300 కోట్ల మేర భారీ ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఆయన పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులను వెలికితీసేలా సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారని, ఎవరు ఏ పదవిలో ఉన్నా చట్టం, నిబంధనలు అందరికీ ఒక్కటేనని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. చెరువుల బఫర్ జోన్లు, నాళాలు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకుండా కాలయాపన చేశారని, బినామీల పేర్లు చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

లీజుకు ఇచ్చాం..: ప్రదీప్‌రెడ్డి

మరోవైపు ఈ ఆరోపణలపై ఫామ్‌హౌస్ యజమానిగా పేర్కొంటున్న ప్రదీప్‌రెడ్డి స్పందించారు. సదరు భూమి పూర్తి యాజమాన్య హక్కులు తనవేనని, 2019లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు ఈ ఆస్తిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని, కేవలం లీజుకు మాత్రమే ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

ఉద్రిక్తత.. భారీ పోలీస్ బందోబస్తు 

కాంగ్రెస్ నాయకులు జన్వాడ ఫాంహౌస్ వద్దకు చేరుకుని, అక్కడి భూములను, నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలించే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ నేతల రాకను బీఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్ట్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫాంహౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.ఈ ఫాంహౌస్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు, అక్రమాల లెక్కలను తేలుస్తామని కాంగ్రెస్ నేతలు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.

మరిన్ని వార్తలు