‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ కాదు సేవ్ డైనాస్టీ మార్చ్
- కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే పనిలో కాంగ్రెస్
- ఓటమి భయంతోనే ఈవీఎంలు, ఈసీపై ఆరోపణలు
- మీరు గెలిస్తే ప్రజా తీర్పు.. ఓడిపోతే పక్షపాతమా?
- దొంగ ఓట్లను కాపాడుతూ మజ్లిస్‌కు వత్తాసు
- బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ విమర్శ
అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఇండి కూటమి(INDIA Alliance) చేపడుతున్న ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ అసలు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర కాదని, అది కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్యూర్లీ ‘సేవ్ డైనాస్టీ మార్చ్’ అని బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్(BJP MP K. Laxman) విమర్శించారు. ఓటమి భయంతోనే ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌పై(Election Commission) కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు.
ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో దేశ ప్రజలు పదే పదే కాంగ్రెస్‌ను ఓడి స్తుంటే ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నా రు. ‘ప్రధాని మోదీ అభివృద్ధి, ప్రజాదరణను ఎదుర్కోలేక.. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే నైతిక ధైర్యం లేకనే ‘ఓట్ చోరీ’, ‘ఈవీఎంల ట్యాంపరింగ్’ అంటూ కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు.
కాంగ్రెస్ గెలిచిన కర్ణాటక, తెలంగాణ, కేరళంలో ప్రజా తీర్పని, ఓడిపోయిన చోట మాత్రం ఈవీఎంలు, ఎన్నికల సంఘం పక్షపాతమంటూ వింత వాదనలు తేవడం ఏమిటి? ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాను కాంగ్రెస్ నాయకులు ‘దేశద్రోహులు’ అంటూ సంబోధించడాన్ని దేశ ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు.
మీ గతాన్ని మరిచిపోయారా?
దొంగ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ‘సర్’ ప్రక్రియ చేపడుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కడుపుమంట అని లక్ష్మణ్ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతూ దొంగ ఓట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదన్నారు. ‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కూనిరాగాలు తీస్తున్న కాంగ్రెస్ నేతలు తమ గతాన్ని మరిచిపోయారా? ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన నల్లటి చరిత్ర నెహ్రూ కుటుంబానిది.
ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న నవీన్ చావ్లాను ఎలక్షన్ కమిషనర్‌గా ఇందిరా గాంధీ నియమించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలుసుకోవాలి. నాటి సీఈసీ ఎన్.గోపాలస్వామి స్వయంగా నవీన్ చావ్లాపై 12 అభియోగాలు మోపినా పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్‌ది’ అని ఆయన దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఆర్‌ఆర్ రాజ్యాంగమా?
బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ కండువా కప్పుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే, అది పార్టీ ఫిరాయింపు కాదని స్పీకర్ సమర్థించడంపై హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ‘తెలంగాణలో ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఇక్కడ ఏమైనా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ‘ఆర్‌ఆర్ రాజ్యాంగం’ నడుపుతున్నారా? చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న ఈ రాజ్యాంగ విరుద్ధ చేష్టలు కనిపించడం లేదా?” అని ఆయన ప్రశ్నించారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే బ్యాలెట్ పద్ధతి నుంచి ఈవీఎంలను తీసుకువచ్చారని, ఇప్పుడు ఈవీఎంలను రాహుల్ గాంధీ వ్యతిరేకించడం అంటే రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని తప్పుపట్టడమేనా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో పటిష్టమైన శాంతిభద్రతల వల్ల రిగ్గింగ్‌లకు తావులేకుండా పోయిందని.. గతంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, తగులబెట్టడం నిత్యకృత్యంగా మారిన పశ్చిమబెంగాల్‌లో సైతం ఇటీవల ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో గమనించాలని సూచించారు.
1952, 1957, 1962, 1967లో కాంగ్రెస్ హయాంలోనే ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. నేడు ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ ద్వారా ప్రజాధనం, సమయం ఆదా అవుతుందంటే రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. మొత్తం ప్రపంచం భారతదేశాన్ని ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా గౌరవిస్తుంటే, విదేశాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, అది దేశద్రోహ చర్య అని పేర్కొన్నారు.