కురుమ సంఘానికి 10 గుంటల భూమి.. వివాదానికి తెర
- సర్పంచ్ అంబాజీ సంతోష్ సమక్షంలో సమావేశం
- సంగోలి రాయన్న జెండా వద్ద కొబ్బరికాయ కొట్టి భూమిపూజ
- సహకరించిన నాయకులకు మాజీ సర్పంచ్ రాజ్‌కుమార్ కృతజ్ఞతలు
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో (Oudhatpur village)సంగోలి రాయన్న జెండా, బీరప్ప మందిర నిర్మాణ జెండా తొలగింపు నేపథ్యంలో తలెత్తిన వివాదం బుధవారం జరిగిన సమావేశంతో సద్దుమణిగింది. ఘటన విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గ కురుమ సంఘం నాయకులు గ్రామానికి చేరుకుని సర్పంచ్ అంబాజీ సంతోష్ సమక్షంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కురుమ సంఘానికి గ్రామంలో 10 గుంటల భూమిని కేటాయిస్తున్నట్లు సర్పంచ్ అంబాజీ సంతోష్ సభాముఖంగా ప్రకటించారు. అనంతరం సంగోలి రాయన్న జెండా వద్ద కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. గ్రామంలోని అన్ని కులాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించడమే తన లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కురుమ సంఘానికి ప్రకటించిన 10 గుంటల భూమి వారికే చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కురుమ సంఘం గ్రామ మాజీ సర్పంచ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి సహకరించిన సర్పంచ్ అంబాజీ సంతోష్‌తో పాటు గ్రామానికి తరలివచ్చిన కురుమ సంఘం నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అందరి సహకారంతో సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడం సంతోషకరమన్నారు.కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర చైర్మన్ బాపు మలిశెట్టి, న్యాయవాది సంగన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పాటిల్, ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ నర్సింలు, నరేష్ యాదవ్, సంజీవ్ కుమార్, మల్గొండ, మాజీ సర్పంచ్ పండరి, మల్లప్ప, మాజీ సర్పంచ్ రాజు, దత్తు, ఓం ప్రకాష్, దశరథ్, నర్సింలు, శ్రవణ్, భీమన్న, కృష్ణప్రసాద్, సర్పంచ్ సుభాష్ చంద్రబోస్, జ్ఞానేశ్వర్, జైపాల్, వెంకట్, సంతోష్, మల్లికార్జున్, అమర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.