ప్రజావాణికి జనం కరువు
ఫిర్యాదు చేసేందుకు ఒక్కరూ రాలే
సమస్యలు పరిష్కారం కావడం లేదా
ప్రజల్లో నమ్మకం సడలుతోందా
కంగ్టి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణికి స్పందన కరువైంది. కంగ్టి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదు చేసేందుకు ఒక్కరు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు రాకపోవడానికి కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదా? ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గతంలో కరపత్రాల ద్వారా ఫిర్యాదులు అందించినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజావాణికి వెళ్లి ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఏమిటనే నిరాశ ప్రజల్లో నెలకొన్నదా? అన్న చర్చ సాగుతోంది. పరిష్కారాలపై అధికారుల దృష్టి ఎప్పుడు ప్రజావాణి అంటే కేవలం ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం మాత్రమే కాదు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదిక కావాలి.
గతంలో అందిన ఫిర్యాదులపై అధికారులు సమీక్ష నిర్వహించి, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.ప్రజల నుంచి వినతులు అందకపోవడాన్ని సాధారణంగా తీసుకోకుండా, ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజావాణికి ప్రజలు ఎందుకు దూరమవుతున్నారు. గతంలో అందిన ఫిర్యాదులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.ప్రజల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది.ఈ ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి.