ముదిరాజుల ఆత్మగౌరవాన్ని కాపాడడమే నా లక్ష్యం
- దౌల్తాబాద్‌లో ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి ఉత్సవాలు
- బిసి-డి నుంచి బిసి-ఎ లోకి మార్చేందుకు ప్రత్యేక సబ్-కమిటీ: కాంగ్రెస్ నాయకులు నీలం మధు
- విద్య ద్వారానే పేదరికం తొలగిపోయి ఉన్నత స్థానాలు సాధ్యం
హత్నూర అక్టోబర్ 22: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో తెలంగాణ సమరయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్(Panduga Sayanna Mudiraj Jayanti) 174వ జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ముదిరాజ్ సంఘ నాయకులు, యువకులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ
2005లో సాధారణ వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు పార్లమెంట్ స్థాయికి పోటీ చేసే వరకు ఎదిగానంటే దానికి ముదిరాజ్ జాతితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు సమస్త వర్గాల ప్రజల ఆదరాభిమానాలే కారణమని నీలం మధు తెలిపారు. ముదిరాజుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు.
‘బిసి-డి’ నుంచి ‘బిసి-ఎ’ లోకి మార్పునకు ప్రత్యేక సబ్-కమిటీ:
ముదిరాజ్ సమాజ దీర్ఘకాలిక డిమాండ్ అయిన ‘బిసి-డి’ కేటగిరీ నుండి ‘బిసి-ఎ’ లోకి మార్చడంపై స్పందిస్తూ.. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. రాబోయే కేబినెట్ సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులతో కూడిన ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేసి,
బిసి-ఎ లోని ఇతర వర్గాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముదిరాజులకు తగిన రిజర్వేషన్లు, ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని హామీనిచ్చారు. ఉమ్మడి జిల్లాల్లో ముదిరాజ్ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, అన్ని వర్గాల సహకారంతో మరింత రాజకీయ ప్రాధాన్యత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
•విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుంది
ప్రతి ముదిరాజ్ కుటుంబం తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. "ఒక రోజు ఉపవాసం ఉన్నా సరే.. మన పిల్లలను మాత్రం ఉన్నత చదువులు చదివించాలి. విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుంది, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరు" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.