సిగాచి ఘటన మరువకముందే సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ
మృతుల కుటుంబాలకు రూ.70 లక్షల పరిహారం.. అంత్యక్రియలకు రూ.లక్ష చొప్పున సాయం
పటాన్చెరు/ జిన్నారం, అక్టోబర్ 23: సిగాచి పరిశ్రమ(Sigachi Industries) ప్రమాదం మరువకముందే గడ్డపోతారం పారిశ్రామిక(Industrial) వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కార్మికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి ఒక్కో కుటుంబానికి రూ.70 లక్షల పరిహారంతో పాటు అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై నిరంతర తనిఖీలు నిర్వహించి, ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.