ఆగి ఉన్న ఆటోను, 5 బైకులను ఢీకొట్టిన కారు, నలుగురికి గాయాలు
నేరేడుచర్ల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నేరేడుచర్ల మండల(Nereducherla Mandal) కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న ఆటోను, ఐదు బైకులను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమావత్ బాలకృష్ణ(29) తన ఆటో (TG 05T 5161) ను మార్కెట్ ఎదురుగా నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడు.
అదే సమయంలో నేరేడుచర్ల నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు (TG 05E 6879) డ్రైవర్ బీఎల్ఎన్ శర్మ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి ఆటోను ఢీకొట్టాడు. అదే వేగంతో అక్కడ పార్క్ చేసి ఉన్న ఐదు మోటార్ సైకిళ్లను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాలకృష్ణతో పాటు ఆటోలో ఉన్న ప్రయాణికులు తక్కెళ్ల సుజాత, తక్కెళ్ల రాకేష్, మీసాల శ్రావణిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐదు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. బాధితుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్. గోపాల్ రెడ్డి తెలిపారు.