కార్యదర్శి.. విధులు ఎగవేతలో మార్గదర్శి..!

27-09-2026 | 06:51am

పంచాయతీ కార్యాలయంలో కనిపించని అధికారి

పట్టించుకొని పంచాయతీరాజ్ అధికారులు.                         

గ్రామంలో అందని సేవలు

ప్రజలకు తప్పని అవస్థలు

మోతె, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): మండల పరిధిలోని గోపతండ గ్రామపంచాయతీ(Gopatanda Gram Panchayat) కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణపై స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకే కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శి విధులు(Panchayat Secretary Duties) నిర్వహించాల్సిన  సమయాల్లో కార్యాలయంలో లేకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీకి సంబంధించిన ధ్రువపత్రాలు, పన్నులు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు తదితర విషయాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు అధికారి అందుబాటులో లేకపోతే తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు ఎఫ్ఆర్ఎస్ వేసే సమయానికి వచ్చి అది వేసిన తర్వాత రెండు, మూడు గంటల పాటు ఉండి తదుపరి ఉన్నతాధికారులకు చెప్పకుండా వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శి విధుల ఎగవేతలో మార్గదర్శి అని పలువురు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విధులు నిర్వహించాల్సిన  సమయాల్లో కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శి వెళ్లిపోతున్న విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గోపతండ వాసులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు