‘దేశం కోసం.. దైవం కోసం’

27-09-2026 | 05:20am

ఆర్మూర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): యువతలో దేశభక్తి, దైవభక్తి పెంపొందించడంతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటుతూ ఆర్మూర్‌కు చెందిన యవకుడు షేర్ ఓంకార్ సైకిల్‌పై(Share Omkar Cycle) సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. ‘దేశం కోసం.. దైవం కోసం’ అనే నినాదంతో ఆర్మూర్ నుంచి లడక్ వరకు చేపట్టిన అతని యాత్ర.. రోజూ వంద కిలో మీటర్ల మేర సాగుతోంది. ఎండ, వాన, అలసటను లెక్క చేయకుండా లక్ష్యం వైపు సాగుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన షేర్ ఓంకార్‌ది సాధారణ కుటుంబం. తల్లిదండ్రులు షేర్ పోశెట్టి, లత. ఒక చెల్లె కూడా ఉంది. తండ్రి ఎలక్ట్రిక్ షాపు నిర్వహిస్తుండగా.. ఓంకార్ ఇంటర్మీడియట్ తరువాత ఉపాధి కోసం గల్ఫ్‌లోని ఖతార్‌కు వెళ్లారు. నాలుగున్నర ఏళ్లుగా ఖతార్‌లోని ఎనర్జి బిల్డింగ్‌లో రిసెపనిస్టుగా పని చేస్తున్న ఓంకార్.. సెలవు దినాల్లో ఆర్మూర్‌కు వచ్చి వెళ్తుంటారు.

ఈ ఏడాది కూడా మూడు నెలలు సెలవులపై వచ్చిన ఓంకార్.. సెలవుల్లో ఖాళీగా ఉండకుండా భిన్నమైన ఆలోచన చేశారు. యువత ఏదైనా సందేశమివ్వాలని సంకల్పించారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు గంజాయి, డ్రగ్స్, మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకూడనే సందేశమివ్వాలని నిర్ణయించుకున్నారు. తన ఇష్ట దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ నెల 4వ తేదీన ఆర్మూర్ నుంచి లడక్ సైకిల్ యాత్ర ప్రారంభించారు.   

సొంత ఖర్చులతోనే సైకిల్ యాత్ర

రాత్రి వేళల్లో ఆలయాల్లో బస చేస్తూ కలిసే ప్రతి వ్యక్తికీ దేశభక్తి, ఆధ్యాత్మికత గురించి చెబుతున్నారు. ఎలాంటి చందాలు, ఆర్థిక సాయం ఆశించకుండా సొంత ఖర్చులతో యాత్ర కొనసాగిస్తున్నారు. తన యాత్రకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్ట్రాగ్రామ్ తదితర సోషల్ మీడియా సాధనాల్లో పోస్టు చేస్తున్నాడు. ఓంకార్ సాహసానికి ఆర్మూర్ ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. అతని యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. 

2,348 కి.మీ దూరం.. సడలని సంకల్పం   

44వ నెంబర్ జాతీయ రహదారిపై సుమారు 2,348 కిలో మీటర్ల దూరాన్ని సైకిల్‌పై అధిగమించాలనే లక్ష్యంతో ఓంకార్ సైకిల్‌యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతి రోజూ 100  కిలో మీటర్ల లక్ష్యంతో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌గా  మీదుగా జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. అక్కడి నుంచి 1వ నంబర్ జాతీయ రహదారిపై లడక్ చేరుకోనున్నారు.

బుధవారం నాటికి సుమారు  2 వేల కిలో మీటర్లు యాత్ర పూర్తి పూర్తి చేశారు. మార్గమధ్యంలో ఎండ, వాన,అలసటతో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. దేశ సరిహద్దు ప్రాంతమైన లడక్‌ను చేరుకుని అక్కడి సైనికులకు సెల్యూట్ చేయాలనే లక్ష్యంతో ప్రతి పెడల్‌తో లక్ష్యానికి చేరువ అవుతున్నారు. 

యువతలో క్రమశిక్షణ పెంచడం లక్ష్యం

ఈ యాత్ర ద్వారా యువతలో దేశభక్తిని, క్రమశిక్షణను, సంకల్ప బలం పెంచడంతో పాటు మత్తు పదార్థాల నుంచి దూరం చేయాలన్నది లక్ష్యం. లడక్ చేరుకుని మన సైనికులకు సెల్యూట్ చేయాలి. యువతకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఆర్మూర్ నుంచి లడక్ వరకు.. ఇది కేవలం దూరం కాదు. నా సంకల్పం, తెగువ, దేశంపై నాకున్న ప్రేమకు నిదర్శనం.

 షేర్ ఓంకార్, సైకిలిస్ట్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా 


మరిన్ని వార్తలు