ప్రతి నీటి చుక్కా భూమిలోకి ఇంకించాలి.!
* ఈబీజీఆర్ఏఎం-జీ పనులను పరిశీలించిన పీడీ సన్నాసయ్య
* ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత.. రైతులు బోర్ల రీఛార్జిపై దృష్టి సారించాలి
* ఫారం పాండ్స్, ఊట కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు
* వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలి
* గ్రామంలో నీటి సంరక్షణ పనులపై సర్పంచ్‌కు పీడీ దిశానిర్దేశం
మోతె, నవంబర్ 06 (విజయక్రాంతి): ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించినప్పుడే భూగర్భ జలాలు(Groundwater) పెరిగి, భవిష్యత్తులో నీటి లభ్యత మెరుగుపడుతుందని పీడీ సన్నాసయ్య అన్నారు. శుక్రవారం మోతే మండలం(Mothe Mandal) రాఘవపురం ఎక్స్‌రోడ్డు గ్రామంలో జరుగుతున్న ఈబీజీఆర్ఏఎం-జీ పనులను ఆయన సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, రైతులు తమ బోర్లకు రీఛార్జి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నీటి నిల్వ కోసం ఫారం పాండ్స్, ఊట కుంటలను నిర్మించుకోవాలని తెలిపారు. ఇళ్లపై పడే వర్షపు నీటిని వృథా చేయకుండా స్లాబ్ నుంచి పైపుల ద్వారా నేరుగా భూమిలోకి ఇంకేలా గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నీటి చుక్కను భూమిలోకి పంపించడం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.
గ్రామంలో నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సర్పంచ్ కోలా లింగయ్యకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీల వివరాలు, మేట్ల పనితీరు, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సందీప్ కుమార్, ఉపాధి హామీ సిబ్బంది, సర్పంచ్ కోలా లింగయ్య, మేట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.