రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి
- కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత
- మూలగూడ గ్రామంలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..
ఉట్నూర్, సెప్టెంబర్ 25( విజయక్రాంతి ): కొమరం భీం జిల్లా ( అసిఫాబాద్ ) లింగాపూర్ మండలంలోని మూల గూడ గ్రామానికి చెందిన పాప కుటుంబాన్ని ఉట్నూర్ ఐటిడిఏ పిఓ మంద మకరందు(ITDA PO Manda Makarand) పరామర్శించారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో సోమవారం రాత్రి రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూలగూడ గ్రామానికి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుక్రవారం పరామర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మూలగూడ గ్రామానికి చేరుకున్న ప్రాజెక్టు అధికారి, చిన్నారి తల్లిదండ్రులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారి మృతి పట్ల ప్రాజెక్టు అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి మృతి చెందడంతో బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ప్రాజెక్టు అధికారి చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ప్రభుత్వం తరఫున అందుతున్న ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.
బాధిత కుటుంబ పరిస్థితిని అధికారులు సైతం పరిశీలించి, వారికి అందాల్సిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారి సంబంధిత అధికారులను సూచించారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని నిబంధనల ప్రకారం అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ పీవీటీవీ ఆత్రం భాస్కర్ , ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారి, ఏఈ (హౌసింగ్) తదితర అధికారులు పాల్గొన్నారు.